హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కలు నాటి న తర్వాత మూడేండ్లు లేదా నాలుగేండ్ల నుంచి పంట దిగుబడి మొదలవుతుంది. కానీ, ఆయిల్‌ఫెడ్ అధికారులు మాత్రం తోట ల్లో నాటేందుకే దిగుబడి వచ్చే వయసున్న 40-60 నెలలున్న మొక్కలను రైతులకు అంటగడుతున్నారు. మొక్కల స్థానంలో నర్సరీల్లో ఏపుగా పెరిగిన చెట్లనే ఏకంగా పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన విత్తనాలు, మొక్కలే పంట దిగుబడికి, రైతు రాబడికి మేలు అన్న మూలసూత్రా న్ని ఆయిల్‌ఫెడ్ అధికారులు విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనికిరాని మొక్కలను పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా రైతులు నిండా మునిగే ప్రమాదం ఉన్నదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మొక్కల పెంపకంలో, నిర్వహణలో అధికారుల వైఫల్యాన్ని రైతులపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. ఆయిల్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం భవిష్యత్తులో రైతులకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉన్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతలేని మొక్కలను నాటడం వల్ల భవిష్యత్తులో పంట దిగుబడిపై ప్రభావం చూపి, రైతులకు నష్టాలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ రైతుల భవిష్యత్తును, వారి కష్ట, నష్టాలను పట్టించుకోకుండా ఇప్పుడు గండం గట్టెక్కితే చాలు.. భవిష్యత్తు గురించి తమకెందుకు అనే ధోరణిలో అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం.
11 లక్షలకు పైగా ఎక్కువ రోజుల మొక్కలు
ఆయిల్‌ఫెడ్ పరిధిలోని ఆయిల్‌పామ్ నర్సరీల్లో భారీ సంఖ్యలో ఎక్కువ వయసు గల మొక్కలు ఉన్నట్టుగా తెలిసింది. అన్ని నర్సరీల్లో ప్రస్తుతం 11.37 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్టుగా సమాచారం. ఇందులో ఎన్ని మొక్కలు నాటడానికి ఉపయోగంగా ఉన్నాయి, ఎన్ని పనికిరావనే లెక్కలు తీశారు. ఇందులో భాగంగానే ఆసక్తికర, అత్యంత ఘోరమైన విషయం బయటపడింది. ఈ మొక్కలన్నీ కూడా 30 నెలలకు పైగా వయసున్నవేనని తెలిసింది. ఇందులో కొన్ని ఏకంగా 60 నెలల మొక్కలు కూడా ఉన్నట్టు తెలిసింది. నారాయణపేట జిల్లా కన్మనూర్ నర్సరీలో 62 నెలల మొక్కలు 4,417, 57 నెలల మొక్కలు 32 వేలు, 56 నెలల మొక్కలు 43 వేలు, 55 నెలల మొక్కలు 33 వేలు ఉన్నట్టుగా తెలిసింది. సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ నర్సరీలో 58 నెలల మొక్కలు 6,417, 56 నెలల మొక్కలు 42 వేల మొక్కలు, 50 నెలల మొక్కలు 72 వేలు ఉన్నట్టుగా తెలిసింది. రంగనాయకసాగర్ నర్సరీలో 40-58 నెలల వయసున్నవి 3.60 లక్షల మొక్కలు ఉన్నట్టుగా తెలిసింది. ములుగు నర్సరీలో 1.23 లక్షల మొక్కలు ఉన్నట్టుగా తెలిసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ రోజుల మొక్కలు 11 లక్షలకు పైగా ఉన్నాయని సమచారం.
ఎక్కువకాలం మొక్కలతో రైతులకు నష్టం
ఆయిల్‌పామ్ తోటల సాగుకు వాస్తవంగా 12 నెలల మొక్కలు నాటాలి. కాస్త అటూ ఇటుగా 18-20 నెలల మొక్కలను సైతం నాటవచ్చు. ఇలా తక్కువ వయసున్న మొక్క లు నాటడం వల్ల ఆరోగ్యంతోపాటు భవిష్యత్తులో ఎలాంటి చీడపీడలు దరిచేరకుండా అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుది. కొన్ని సందర్భాల్లో 24 నెలల వయసున్న మొక్కలను కూడా పంపిణీ చేయొచ్చని ఆయిల్‌పామ్ నిపుణులు చెప్తున్నారు. అంతకు మించి వయసున్న మొక్కలను అసలే నాటొద్దని హెచ్చరిస్తున్నారు. అలాంటి మొక్కలను నాటడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఏర్పడుతాయని, 30 ఏండ్లు దిగుబడి ఇవ్వాల్సిన చెట్లు 20 ఏండ్లు మాత్రమే దిగుబడి ఇస్తాయని చెప్తున్నారు. ఏకంగా 30-40% దిగుబడి తగ్గుతుందని వివరిస్తున్నారు. వీటి నిర్వహణ కూడా కష్టమేనని తెలిపారు. వాస్తవాలు, ఇబ్బందులను దాచేస్తున్న ఆయిల్‌ఫెడ్ అధికారులు.. వయసు దాటిన మొక్కలను, నాటేందుకు పనికిరాని మొక్కలను రైతులకు కట్టబెడుతున్నారు. ఇవేవీ తెలియని అమాయక రైతులు ఆ మొక్కలను తీసుకెళ్తున్నారు. దీంతో తర్వాత జరిగే నష్టాలు, ఇబ్బందులకు ఎవరు బాధ్యులనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
పనికిరాని మొక్కలు కట్టబెట్టే కుట్ర!
రాష్ట్రంలో ఎక్కువ వయసున్న 11.37 లక్షల మొక్కల్లో 9.45 లక్షల మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్నట్టు ఆయిల్‌ఫెడ్ సంస్థ ఓ నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలిసింది. మిగిలిన 1.91 లక్షల మొక్కలు నాటేందుకు అనుకూలంగా లేవని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంటే ఈ మొక్కలను రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పంపిణీ చేయొద్దు. కానీ అధికారులు నాటేందుకు పనికిరాని మొక్కల్లోనూ పనికొచ్చే మొక్కలు ఉన్నట్టు నివేదిక ఇవ్వడం గమనార్హం. నాటేందుకు పనికిరాని 1.91 లక్షల మొక్కల్లో 1.09 లక్షల మొక్కలను మళ్లీ బాగు చేయొచ్చని అదే నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం. అంటే తొలుత పనికిరావని చెప్పిన మొక్కలను మళ్లీ ఏదో చేసి వాటిని రైతులకు పంపిణీ చేయాలనే ఆలోచనలోనే అధికారులు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఇక మిగిలిన 82 వేల మొక్కలను పూర్తిగా తొలగించాలని ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం.