న్యూఢిల్లీ : పొగతాగితే ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ పరోక్షంగా పొగ పీల్చినా ప్రాణాలు పోతాయని.. అది కూడా నేరుగా పొగ తాగిన వారితో దాదాపు సమానమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందని తాజాగా మరో సర్వే బయటపెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగని వారు కూడా పరోక్షంగా పొగ పీల్చి ప్రాణాలు కోల్పుతున్నారు. తాజాగా గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం ప్రకారం భారత్లో 2023లో 3.25 లక్షల మంది పరోక్షంగా పొగతాగి ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లోనే ఈ పరోక్ష ధూమపానం ఉంటున్నదని అధ్యయనం వెల్లడించింది.
44.4 కోట్ల మందికి ముప్పు..
నీతి అయోగ్ మాజీ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ 1990తో పోలిస్తే 2023 నాటికి పరోక్ష ధూమపానానికి గురవుతున్న వారు 31 శాతానికి తగ్గినా.. జనాభా పెరుగుదల కారణంగా బాధితుల సంఖ్య మాత్రం పెరిగిందన్నారు. 2023లో సుమారు 44.4 కోట్ల మంది భారతీయులు పరోక్షంగా ధూమపానానికి గురైనట్లు జీడీబీ అధ్యయనంలో తేలిందన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమా కుమార్ మాట్లాడుతూ డిజిగ్నేటెడ్ స్మోకింగ్ జోన్ల విధానానికి బదులు పూర్తిగా పొగ రహిత బహిరంగ ప్రదేశాలను పెంచాలని.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ఆంక్షలు విధిస్తే సరిపోదని.. ఇండ్లలో కూడా పిల్లలు, మహిళలు పొగ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీఎం కటోచ్ తెలిపారు. పరోక్ష ధూమపానం వల్ల శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం పడుతుందని కటోచ్ వెల్లడించారు.
ఏటా 13.5 లక్షల మరణాలు..
భారత్లో పొగాకు వినియోగం కారణంగా ప్రతి ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఖైనీ, గుట్కా, జర్దా, పొగాకు పాస్తో పాటు బీడీలు, సిగరెట్లు, హుక్కా వంటి ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 2008 అక్టోబర్ 2న బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చారు. కానీ చట్టం పూర్తి స్థాయిలో అమలు కాక పబ్లిక్ ప్లేసుల్లో ధూమపానం పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.