టొరంటో: బలవంతపు వసూళ్లు, హింస కేసులో కెనడా అధికారులు ఐదుగురు భారతీయులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరైన సంకేత్ సింగ్లాను భారత్ నుంచి రప్పించి టోరంటో విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకున్నారు. కొందరు తమ నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని లాంగ్లీలోని ఓ ఆటో డీలర్షిప్ సహ యజమానులు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులకు నిరుడు ఫిర్యాదు చేశారు.
అప్పటి నుంచి ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నది. నిందితులు బాధితుల ఇండ్లు, ఆస్తుల దహనానికి పాల్పడి, వారిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసులు వివిధ దేశాల్లో దర్యాప్తు జరిపి ఒక ముఠా బలవంతపు వసూళ్లు, చట్ట వ్యతిరేక పనులు, అక్రమ రవాణా లాంటి నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ నేరాల్లో సంకేత్ సింగ్లాది కీలక పాత్ర అని తెలుసుకొని ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంతో ఈ నెల 1న అతడిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను సర్రే, ఒట్టావాలో అరెస్ట్ చేశారు. వారి నుంచి కొన్ని ఆయుధాలు, మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు.