వేములవాడటౌన్, ఫిబ్రవరి 14 : శివపూజకు వేళయింది. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచీ పూజల్లో తరించి ఆలయంలో మహాదేవున్ని దర్శించి, రాత్రంతా జాగారం చేసేందుకు భక్తజనం సిద్ధమైంది. కాగా, ఎములాడలో శివరాత్రి జాతర ప్రారంభమైంది. శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం రాజన్న అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. శనివారం రాత్రి శివార్చనతో ఉత్సవాలు మొదలుకాగా, రాష్ట్ర నలుమూలల నుంచీ భక్తజనం తరలివస్తున్నది.
ఇది వరకే ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపాలు, కలకత్తా డెకొరేషన్ క్లాత్ పందిళ్లతో ముస్తాబు చేశారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ చెరువు ప్రాంతంలోని మైదానంలో శివార్చన పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోన శైవక్షేత్రాలు శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి.