Ketogenic Diet | కీటోజెనిక్ డైట్.. ప్రస్తుతం బరువు తగ్గాలనుకునే వారిలో బాగా ప్రాచుర్యం పొందిన ఆహార విధానం. హాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు తమ శరీర ఆకృతిని మార్చుకోవడానికి ఈ డైట్‌ను అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తుంటాయి. అయితే కీటో డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. బరువు తగ్గడానికి ఈ డైట్‌ను ప్రారంభించే ముందు దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. కీటోజెనిక్ డైట్లో కార్బొహైడ్రేట్ల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించి, కొవ్వుల వినియోగాన్ని పెంచుతారు. సాధారణంగా శరీరం శక్తి కోసం కార్బొహైడ్రేట్లను ఉపయోగిస్తుంది. అయితే కార్బొహైడ్రేట్లు తక్కువగా లభించినప్పుడు శరీరం నిల్వ ఉన్న కొవ్వును శక్తి కోసం ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియను కీటోసిస్ అంటారు. దీని ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుందని కీటో డైట్ భావన.
అయితే కీటో డైట్లో కొవ్వులు ఎక్కువగా తీసుకోవాలంటే ఏ కొవ్వు పడితే అది తీసుకోవచ్చని కాదు. చీజ్, వెన్న, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వంటి అధిక కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే అవకాడో వంటి మొక్కల ఆధారిత ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కీటోజెనిక్ డైట్లో చీజ్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఫెటా చీజ్‌ను ఇందులో చేర్చుకోవచ్చు. ఫెటా చీజ్ సాధారణంగా గొర్రె పాలతో తయారు చేసే ఉప్పునీటిలో ఉంచిన పెరుగు చీజ్. అనేక ఇతర రకాల చీజ్‌లతో పోలిస్తే ఇందులో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఫెటా చీజ్‌లో సుమారు 21 గ్రాముల కొవ్వు ఉంటుంది. కొవ్వుతోపాటు కాల్షియం, ప్రోటీన్ కూడా ఇందులో లభిస్తాయి. కీటో డైట్లో కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. కార్బొహైడ్రేట్లు త్వరగా జీర్ణమై కడుపు ఖాళీ అయ్యే అవకాశం ఉండగా, కొవ్వులు ఎక్కువసేపు జీర్ణమవుతాయి. కొవ్వులు, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల సంతృప్తి భావన ఎక్కువసేపు ఉండి, తద్వారా తక్కువగా తినే అవకాశం ఉంటుంది.
అయితే భారతీయుల ఆహార విధానాన్ని దృష్టిలో ఉంచుకుంటే కీటో డైట్‌ను అనుసరించడం అంత సులభం కాదని పేర్కొంటున్నారు. భారతీయులు సాధారణంగా బియ్యం, ఇతర ధాన్యాలు, పప్పులు, కాయధాన్యాలు, మిల్లెట్లు వంటి కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలపై ఎక్కువగా ఆధారపడతారు. మాంసాహారాన్ని కూడా అధిక పరిమాణంలో తీసుకోవడం సాధారణం కాదు. అందువల్ల భారతీయ ఆహార విధానానికి కీటో డైట్ సరిపోదని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కార్బొహైడ్రేట్లను చాలా తక్కువగా తీసుకునే సమయంలో తగినంత ద్రవాలు తీసుకోకపోతే కిడ్నీలో లేదా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అలాగే ధాన్యాలు, గింజలు, విత్తనాలు, పప్పుధాన్యాలను పూర్తిగా తగ్గించడం లేదా తొలగించడం వల్ల ఫైబర్, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి తగినంతగా అందవు. అందువల్ల కీటోజెనిక్ డైట్‌ను స్వయంగా ప్రారంభించడం కంటే ముందుగా అర్హత కలిగిన పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
సరైన ప్రణాళిక లేకుండా లేదా ఎక్కువకాలం పర్యవేక్షణ లేకుండా ఈ డైట్‌ను పాటిస్తే బరువు తగ్గడానికి బదులుగా శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అలవాట్లు, శరీర అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కీటో డైట్‌ను అనుసరించాలి.