Bombay High Court : వయసొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల (Parents) ఆస్తి కాదని, వారు తమ జీవితంపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉన్న స్వతంత్రులని బాంబే హైకోర్టు (Bomaby High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో జీవించేందుకు వెళ్లిన కుమార్తెను తమకు అప్పగించాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్ (Petition) ను కోర్టు కొట్టివేసింది. మేజర్ అయిన యువతి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కలిగి ఉంటుందని కోర్టు సమర్థించింది.
నాగ్‌పుర్‌కు చెందిన ఓ యువతి 17 ఏళ్ల వయసులో ట్యూషన్‌కు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి ఓ యువకుడితో కలిసి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను గుర్తించి తల్లికి అప్పగించారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆమె మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తన కుమార్తెను ఆ యువకుడు అక్రమంగా నిర్బంధించాడంటూ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా కోర్టు నేరుగా ఆ యువతితో మాట్లాడింది. తాను తన ఇష్టప్రకారమే ఆ యువకుడితో కలిసి ఉంటున్నానని, అతనితోనే జీవించాలనుకుంటున్నానని స్పష్టంచేసింది.
ప్రస్తుతం ఆ యువతి మేజర్ అని నిర్ధారించుకున్న న్యాయస్థానం.. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని తెలిపింది. అక్రమ నిర్బంధం అనేది రుజువు కానందున హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని స్పష్టంచేస్తూ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం కొట్టివేసింది.