Amit Shah | ఢిల్లీ: పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) బుధవారం స్పందించారు. పార్లమెంటుకు వస్తాను. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అని అన్నారు. ప్రతిపక్షాల చర్చ కోసం 24 గంటల సమయం కేటాయిస్తాని తెలిపారు. నీట్ విద్యార్థుల నిరసన అణచివేత, రామ మందిర విరాళాల దుర్వినియోగంపై చర్చించేందుకు అధికారికంగా లేఖ రాయాలని అమిత్ షా సూచించారు. దీనిపై సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
అమిత్ షా రాజీనామా చేయాలి
అమిత్ షా ప్రతిపాదనపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందిస్తూ ఆయనతో చర్చించడానికి మాకేం భయం లేదని అన్నారు. ఆయన చెప్పే ఉపన్యాసాలు వినడానికి ప్రతిపక్షానికి ఆసక్తి లేదని, విద్యార్థుల నిరసన అణచివేతపై సమాధానం చెప్పాలని తెలిపారు. విద్యార్థులపై కాల్పులు ఎవరు జరిపారు. మేకులు ఉన్న లాఠీలతో ఎవరు కొట్టించారు అని రాహుల్ ప్రశ్నించారు. ఈ సంఘటనపై కేంద్ర హోం మంత్రి ఆదేశాలు ఉంటే వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై సమాధానాలు చెప్పేందుకు 20 రోజులుగా అమిత్ షా కనిపించకుండా పోయారని, సమాధానం చెప్పే ధైర్యం లేక సభకు రావడం లేదని అన్నారు. విద్యార్థులపై లాఠీచార్జితో పాటు రామ మందిర విరాళాల దుర్వినియోగంపై కూడా ప్రశ్నిస్తామని ఏ విషయంలోనూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.