బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jun 29, 2020 , 00:54:32

ఆలోచించండి గురూ..

ఆలోచించండి గురూ..

  • ఆర్థిక లక్ష్యాలపై అలసత్వం వద్దు

కరోనా మహమ్మారి మనలో చాలా మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసింది. భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలనూ దెబ్బతీసింది. అయితే కొన్ని ఆచరణీయ సర్దుబాట్లు చేసుకోకపోతే మన కలలు కల్లలే.

కరోనాకు ముందు మనలో చాలా మందికి కొత్త ఇంటిని కొనాలనో.. నచ్చిన కారును సొంతం చేసుకోవాలనో.. ఉద్యోగానంతర జీవితానికి పొదుపు చేయాలనో.. పిల్లల చదువు, పెండ్లిండ్ల కోసం కూడబెట్టాలనో.. 

ఇలా ఏవేవో ఆశయాలుండేవి. కానీ కరోనాతో పోరులో ఇవన్నీ మరుగునపడిపోయాయి.

అయితే సరైన వ్యూహాలతో ముందుకెళ్తే మళ్లీ మన లక్ష్యాల దిశగా పయనించడం కష్టమేమీ కాదు. 

ప్రస్తుత ఆదాయ వనరులకు తగ్గట్లుగా ఆలోచిస్తే ఇప్పుడున్న ఈ సమస్యలను అధిగమించవచ్చు.

ఉద్యోగం ఉంటుందో పోతుందో.. వ్యాపారం నడుస్తుందో ఆగిపోతుందో.. ఆదాయం తగ్గింది ఇల్లు గడిస్తే అదే పదివేలురా దేవుడా.. మనలో చాలా మంది మనసులో మాటలివి. మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న కరోనా వైరస్‌ ధాటికి వర్తమానం తప్ప భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించట్లేదంటే అతిశయోక్తి కాదిప్పుడు. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి.. అందరి ఆర్థిక లక్ష్యాలను కూలదోస్తున్నది. అయితే ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉన్నట్లే.. ఆలోచిస్తే లక్ష్య సాధనకూ ఓ మార్గం కనిపిస్తుంది.

ఇల్లు కొనాలనుకున్నారా?

ఈ ఏడాది సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకున్నవారిలో చాలా మంది కరోనా కారణంగా వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గృహ రుణం వంటి దీర్ఘకాల లక్ష్యాలకు ఎవరూ సాహసించడం లేదు. ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు ఇందుకు కారణం. అయితే మార్కెట్‌లో డిమాండ్‌ లేక ఇండ్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ గృహ రుణాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గించేస్తున్నాయి. కాబట్టి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయమన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద వడ్డీ రాయితీని కూడా పొందవచ్చు. మీ ఇంటి విలువ రూ.45 లక్షల లోపుంటే ఐటీ చట్టం 80ఈఈఏ సెక్షన్‌ కింద అదనపు పన్ను ప్రయోజనాలనూ అందుకోవచ్చు.

పెట్టుబడులు పెట్టాలనుకున్నారా?

ఈ కష్ట కాలంలో రిస్క్‌తో కూడిన పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అందుకే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వైపు దృష్టి సారించండి. మీ ప్రధాన ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీ కష్టార్జితానికి కచ్ఛితమైన ప్రయోజనాలను అందించడంలో ఎఫ్‌డీలే ముందుంటాయి. భవిష్యత్తులో ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెరిగితే మరిన్ని లాభాలను అందుకోవచ్చు. ఇక మీ ఆదాయ వనరుల ఆధారంగా మ్యూచువల్‌ ఫండ్స్‌, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ గురించీ నిపుణుల సూచనలతో ఆలోచించవచ్చు.

ఒత్తిడిని జయించండిలా

కరోనా వైరస్‌ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇంకొన్ని సంస్థలు జీతాలకు కోత పెడుతున్నాయి. మరికొన్ని వేతనం లేని సెలవులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తకొత్త అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఆలోచించడం మేలు. మీ నైపుణ్యానికి అనువైన ఉద్యోగాలను వెతుక్కోవడం మంచిది. అంతేగాక డిమాండ్‌ ఉన్న రంగాల వైపు వెళ్లి, అందులోని మెలకువలను ఒడిసి పట్టుకుంటే అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటే తేలిగ్గా అవసరాలను తీర్చుకోవచ్చు. అత్యవసరమైతే రుణాల ఈఎంఐలపై మారటోరియం తీసుకోవడం వల్ల కొంత ఊరటను పొందవచ్చు.


logo