బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 17:56:12

క‌రోనా క‌ట్ట‌డికి క‌మిటీలు వేయండి : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

క‌రోనా క‌ట్ట‌డికి క‌మిటీలు వేయండి : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌కు, రాగ‌ద్వేషాల‌కు అతీతంగా ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఏకం కావాలె. ఏ ఊరికి ఆ ఊరే క‌ట్ట‌డి కావాలె. క‌రోనాను క‌ట్ట‌డి చేయాలె. ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, యూత్ ని ఏక తాటిపైకి తేవాలె. గ్రామ‌, మండ‌ల స్థాయిలో క‌మిటీలు వేయాలె. ఆయా క‌మిటీలు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌యం చేస్తూ, స‌మీక్షిస్తూ, క‌రోనా బాధితుల‌ను ఆదుకోవాలె... అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. 

హైద‌రాబాద్ లోని మంత్రుల ఆవాసంలోని త‌న నివాసం నుంచి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్ద‌వంగ‌ర‌, కొడ‌కండ్ల‌, దేవ‌రుప్పుల‌ మండ‌లాల వారీగా, ఒక్కో మండ‌లం నుంచి 120 మందికి పైగా ప్ర‌జాప్ర‌తినిధులు, ఆర్డీఓ స‌హా అన్ని శాఖ‌ల అధికారులు, పోలీసులు, ప‌లువురు ప్ర‌ముఖుల‌తో మంత్రి, టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ది. ఈ మ‌హమ్మారికి మందు లేదు. టీకాలు ఇంకా రాలేదు. దేశ దేశాలు దాటి మ‌న దేశానికి వ‌చ్చింది. మ‌హాన‌గరాలు, న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు దాటి ప‌ల్లెల‌కు పాకింది. ఇక ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలె. మ‌రో రెండు నెల‌లు క‌ఠినంగా ఉండాలె అని మంత్రి అన్నారు. గ్రామ స్థాయిలో, మండ‌ల స్థాయిలో రాజ‌కీయాల‌కు అతీతంగా క‌మిటీలు వేయండి. ఆయా క‌మిటీల్లో అన్ని రాజ‌కీయ పార్టీల‌ను భాగ‌స్వాముల‌ను చేయండి. క‌లిసి వ‌చ్చేవాళ్ళంద‌రినీ క‌లుపుకుపోండి. స్వ‌చ్ఛంద సంస్థ‌లు, స్వ‌చ్ఛంద సేవ‌కులు, యూత్ ని క‌లుపుకోండి. ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ, చైత‌న్య ప‌రుస్తూ క‌రోనాని క‌ట్ట‌డి చేయాల‌ని సూచించారు.

ఒక్కరికి పాజిటివ్ వచ్చినా ఇంట్లో వాళ్ళందరికీ పరీక్షలు చేయాల‌ని సూచించారు. నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులు, అధికారులకు దండన విధిస్తామ‌ని హెచ్చ‌రించారు. త్వ‌ర‌లోనే నియోజ‌క‌వ‌ర్గానికి రెండు అంబులెన్సులు, 4లక్ష‌ల మాస్కులు అందిస్తామ‌న్నారు. మాస్కులు లేకుండా తిరిగితే, జ‌రిమానాలు విధిస్తామ‌న్నారు. రైతు వేదికలు, కల్లాలు, డంపు యార్డులు, వైకుంఠ ధామాలు వేగంగా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు.   


logo