గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 09, 2020 , 01:40:08

వోక్స్‌, బట్లర్‌ సూపర్‌

వోక్స్‌, బట్లర్‌ సూపర్‌

చేతిలోకొచ్చిన మ్యాచ్‌ను వదిలేసుకోవడం ఎలాగో.. పాకిస్థాన్‌కు తెలిసినంత బాగా మరే జట్టుకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆరంభంలో అదరగొట్టిన పాకిస్థాన్‌.. చివరికొచ్చేసరికి  చేతులెత్తేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడంతో పాటు ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసిన పాక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోయింది. టాపార్డర్‌ విఫలమైన చోట వోక్స్‌, బట్లర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ బోణీ కొట్టింది.

మాంచెస్టర్‌: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో చివరకు విజయం ఇంగ్లండ్‌ను వరించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 277 పరుగుల లక్ష్యఛేదనలో టాపార్డర్‌ విఫలమైనా.. క్రిస్‌ వోక్స్‌ (84 నాటౌట్‌; 10 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (75; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) అదరగొట్టడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రూట్‌ (42), సిబ్లే (36) ఫర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లలో యాసిర్‌ షా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 137/8తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్థాన్‌ మరో 32 పరుగులు చేసి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రాడ్‌కు 3, వోక్స్‌, స్టోక్స్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. వోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి సౌతాంప్టన్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. 

139 పరుగుల భాగస్వామ్యం

బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై 277 పరుగుల లక్ష్యం కూడా భారీగానే కనిపించింది. అందుకు తగ్గట్లే పాక్‌ బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. బర్న్స్‌ (10), స్టోక్స్‌ (9), పోప్‌ (7) విఫలమయ్యారు. ఈ దశలో జత కలిసిన వోక్స్‌, బట్లర్‌ వన్డే తరహా ఇన్నింగ్స్‌తో దుమ్మురేపారు. మిగిలిన ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. అందుకు భిన్నంగా బట్లర్‌, వోక్స్‌ జోడీ పాక్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ దూసుకెళ్లింది. ఈ క్రమంలో బట్లర్‌ 55 బంతుల్లో.. వోక్స్‌ 59 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించాక బట్లర్‌ ఔటైనా.. వోక్స్‌ మిగిలిన పని పూర్తి చేశాడు.

సంక్షిప్త స్కోర్లు

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 326, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 219, పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌ 169, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 277/7 (వోక్స్‌ 84 నాటౌట్‌, బట్లర్‌ 75; యాసిర్‌ షా 4/99).logo