Cyber Crime Preventation Tips | అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాడు దీపక్. తన స్నేహితుడు శరత్‌కు ఫోన్ చేశాడు. లంచ్‌కు రమ్మన్నాడు. లొకేషన్ షేర్ చేశాడు. జీపీఎస్‌లో చూస్తే తను ఎక్కడికి వెళ్లేది ఎవరైనా తెలుసుకోవచ్చు అనుకున్నాడు శరత్. అలాగని జీపీఎస్ ఉపయోగించకుంటే అక్కడికి చేరుకోవడం కష్టమే! కన్వీనియెంట్ అని జీపీఎస్‌ను ఉపయోగించుకోవడమా? ప్రైవసీ దెబ్బతింటుందని పక్కన పెట్టడమా? తేల్చుకోలేకపోయాడు. ఒక్క శరత్ మాత్రమే కాదు, చాలామంది పరిస్థితీ ఇదే. అయితే, సాంకేతిక ప్రపంచంలో మన ప్రైవసీని కాపాడుకోవాలంటే.. మన సమాచార వ్యవస్థను అష్టదిగ్బంధనం చేయడం ఒకటే మార్గం.
వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం అనుకున్నంత తేలికేం కాదు! మన చర్యలే మన డేటాను ఆన్లైన్లో వైరల్ అయ్యేలా చేస్తుంటాయి. షాపింగ్ వెళ్తే.. బిల్లు చెల్లించడంతో ఆగకుండా.. కౌంటర్లో ఉన్న వ్యక్తి ఫోన్‌నంబర్ అడగ్గానే టకటకా చెప్పేస్తుంటారు చాలామంది. మెడికల్ షాప్‌కి వెళ్లినా పేరు, ఊరు, ఫోన్‌నెంబర్ ఇచ్చేస్తుంటారు. ఆన్లైన్ మార్కెట్లో అయితే మరీనూ! పేరు, జెండర్, మెయిల్ అడ్రస్ చకచకా నింపేస్తుంటారు. కాలక్షేపం పేరుతో డేటింగ్ యాప్స్ వాడకం ఎడాపెడా పెరిగింది. చాటింగ్ జోరులో.. మన ఫోన్లోకి ఎవరు తొంగిచూస్తున్నారో విస్మరిస్తున్నాం. ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే మనం చేసే పోస్టులు మన మనస్తత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఉంటున్నాయి. రాజకీయ ఆసక్తులు, సంగీతంలో అభిరుచులు.. అన్నీ పంచుకుంటున్నాం. ఈ వివరాలు మన స్నేహితులు మాత్రమే చూస్తారు అనుకుంటే పొరపాటు! వ్యక్తిగత డేటాను కాజేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు అనుకున్నదే తడవుగా వినియోగదారుడి జాతకాన్నంతా ఒడిసిపడతారు. అందినకాడికి డేటాను సంగ్రహించి, అయినకాడికి అమ్ముకుంటారు. ఇలాంటి ఉచ్చులో చిక్కినప్పుడు బెదిరింపులకు గురికావొచ్చు, ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు, మర్యాదకు భంగం వాటిల్లవచ్చు.
ఇంటర్నెట్లో చేసే సెర్చింగ్ కూడా మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి దోహదపడే అవకాశం ఉంటుంది. బ్రౌజింగ్ హిస్టరీతోపాటు ఏ వెబ్‌సైట్‌ను ఎక్కువసార్లు చూస్తున్నాం, ఎలాంటి లింక్‌లు క్లిక్ చేస్తున్నాం, షాపింగ్ హ్యాబిట్స్.. ఇలా మనం యథాలాపంగా చేసేవన్నీ పనిగట్టుకొని పరిశీలించే శక్తులు ఉంటాయి. వీటి బారినపడకుండా ఉండటం కోసం వ్యక్తిగతంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అనవసరమైన యాప్‌లు ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసే క్రమంలో వ్యక్తిగత సమాచారం, మన కాంటాక్టులు, కెమెరా పర్మిషన్లు అడుగుతుంటే ఇచ్చేస్తూ ఉండొద్దు! ఆ యాప్ మూలాలు తెలుసుకొని, సరైన అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారణ అయిన తర్వాతే ఇన్స్టాల్ చేసుకోవాలి. అవసరం ఉన్నా, లేకపోయినా లొకేషన్ పర్మిషన్ ఇచ్చేస్తూ ఉంటాం. ఫోన్లో కూడా లొకేషన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుతాం. దీనివల్ల మనం ఎక్కడికి వెళ్లింది యాప్ నిర్వాహకులు కనిపెట్టే ప్రమాదం ఉంది. ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో అయితే, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కింది, ఎక్కడ దిగింది అన్నీ షేర్ చేస్తూ డేటా చోరులకు కావాల్సినంత సమాచారం అందిస్తున్నాం.
☞ ఈ-మెయిల్ గానీ, ఫోన్ నంబర్ గానీ డేటా చౌర్యానికే గురైందని భావిస్తే.. తెలుసుకోవడం ఎలా? అందుకోసం ప్రత్యేకమైన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. https://amibeingpwned.com, https://snusbase.com, https://leakcheck.net, https://leaked.site, https://leakcorp.com/login, https://haveibeensold/.app లింక్‌ల ద్వారా డేటా చౌర్యం గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవచ్చు.
వ్యక్తిగత సమాచారం పరులపాలు అయ్యే ప్రమాదం ఉందని టెక్నాలజీకి దూరంగా ఉండటమూ కుదరదు! కానీ, చోరుల కన్ను పడకుండా మనకు మనమే రక్షణ కల్పించుకోవడం చాలా అవసరం.
☞ మనం వాడుతున్న యాప్‌లకు సంబంధించిన పాస్వర్డ్లు స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి. పేరు, పుట్టినరోజు వివరాలు కాకుండా కఠినమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోవాలి.
☞ వ్యక్తిగత సమాచారం షేర్ చేయాల్సి వచ్చినప్పుడు.. ఎందుకు పంపాలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.
☞ మీ ఫోన్లో, కంప్యూటర్లో నమ్మకమైన యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
☞ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ, యాప్ కానీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి.
☞ బ్రౌజర్లో సెక్యూర్డ్ వెబ్సైట్లు మాత్రమే చూడాలి. అంటే https:// తో మొదలయ్యే లింక్‌ల వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండదు.
☞ ఫోన్‌కు అపరిచిత సోర్స్ నుంచి సందేశం వచ్చినప్పుడు దాని మూలం ఏమిటన్నది తెలుసుకోవడానికి https://smsheader.trai.gov.in/ వెబ్‌లింక్‌ను ఉపయోగించండి.
☞ మీకు వచ్చిన మెయిల్ సందేహాస్పదంగా ఉంటే.. ముందుగా హెడర్ చెక్ చేయాలి. http://mxtoolbox.com/EmailHeaders.aspx లింక్ ఓపెన్ చేసి, బాక్స్‌లో హెడర్‌ను పేస్ట్ చేస్తే ఆ మెయిల్ పంపిన అసలు చిరునామా తేటతెల్లం అవుతుంది.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Deepfakes | ఈ చిన్న ట్రిక్స్ సహాయంతో డీప్ ఫేక్స్‌ను ఈజీగా గుర్తించవచ్చు
Influencers | ఏదైనా వస్తువు కొనేముందు ఆన్లైన్లో రివ్యూలు చదువుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
Work Form Home | ఇంటి నుంచే లక్షలు లక్షలు సంపాదించొచ్చని కాల్స్ వస్తున్నాయా?
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్‌లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?