Khawaja Asif : పాకిస్తాన్ సైన్యంకంటే బలూచ్ రెబల్స్ దగ్గరే ఆధునిక, ప్రభావవంతమైన ఆయుధాలున్నాయని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ క్రమంగా పట్టుకోల్పోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై మంగళవారం ఆసిఫ్ మాట్లాడారు. అక్కడి పరిస్థితుల్ని వివరించారు. ‘‘బలూచ్ రెబల్స్ వద్ద 2 మిలియన్ డాలర్ల విలువైన రైఫిల్స్ ఉన్నాయి. అవి పాక్ సైన్యం వద్ద కూడా లేవు.
ఒక్కోటి రూ.4.5 లక్షల విలువగల థర్మల్ వెపన్స్ కూడా వారివద్ద ఉన్నాయి. కొన్ని అమెరికన్ ఆయుధాలు కూడా కలిగి ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 20 వేల డాలర్ల విలువైన గేర్ ఉంది. ఇలాంటి ఆయుధాలు వారికి ఎక్కడినుంచి వస్తున్నాయి..? ఇలాంటి ఉగ్రవాద సంస్థల నాయకులు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారు. క్రిమినల్స్‌తో సంబంధాలున్న వారితో మేం చర్చలు జరపబోం. బీఎల్ఏ పేరు మీద దాడులు జరుగుతున్నాయి. ఈ సంస్థకు ఇండియాతో సంబంధం ఉంది. బెలూచ్ రెబల్స్ దాడులు ఆపకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయి’’ అని ఖవాజా హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యానికి, బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు మధ్య కొన్నేళ్లుగా యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 31న పాక్ ఆర్మీకి, బలూచ్ రెబల్స్‌కు మధ్య భీకర యుద్ధం జరిగింది. పాక్ భద్రతా దళాలపై బీఎల్ఏ భీకర మెరుపు దాడులు చేసింది.
ఆత్మాహుతి దాడులకూ పాల్పడింది. దీంతో పాక్ ఆర్మీ కూడా స్పందించింది. ఈ ఘర్షణలో ఇరువైపులా ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా పాక్ భద్రతా సిబ్బంది మరణించగా, 170 మంది వరకు బలూచ్ రెబల్స్ మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్, ఆఫ్ఘన్ సరిహద్దులో ఉండే ప్రాంతం బలూచ్. ఈ ప్రాంతాన్ని 1948లో పాక్‌లో కలిపారు. ఆ తర్వాత నుంచి బలూచ్ రెబల్ గ్రూప్స్‌కు, పాక్ ఆర్మీకి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంది. పాక్ నుంచి స్వాతంత్రం కావాలని రెబల్స్ పోరాడుతున్నారు. బలూచ్ ప్రాంతంలో అత్యధిక విలువైన ఖనిజ వనరులు ఉండటం.. వీటిపై పాక్ కన్నేయడమే ఇందుకు కారణం.