గురువారం 28 జనవరి 2021
Nizamabad - Dec 04, 2020 , 00:18:29

‘వేగం’గా పోతున్నారు..!

‘వేగం’గా  పోతున్నారు..!

  • కామారెడ్డి జిల్లాలో యేటా సగటున 400కు పైగా రోడ్డుప్రమాదాలు
  • ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు 198 మంది మృత్యువాత 
  • జాతీయ రహదారులపై యథేచ్ఛగా మద్యం అమ్మకాలే కారణం
  • రాత్రి వేళల్లో కొరవడిన పోలీసుల పర్యవేక్షణ
  • ప్రమాదకర ప్రాంతాల్లో సూచిక బోర్డులు అమర్చని ఎన్‌హెచ్‌ఏఐ

రెండు జాతీయ రహదారులు వెళ్తున్న కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడోచోట రహదారి రక్తమోడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం రోడ్డుప్రమాదాల్లో వందలాది మంది మృత్యువాతపడుతుండగా.. వారి సంఖ్యకు సగటున దాదాపు 2.5రెట్ల మంది  క్షతగాత్రులుగా మిగులుతున్నారు. ఫలితంగా వందలాది కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు చీకటిని నింపుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌  వరకు 11నెలల కాలంలో 468 యాక్సిడెంట్లు జరుగగా.. 198మంది ప్రాణాలు కోల్పోయారు.  గాయపడిన వారి సంఖ్య 507. 

మద్యంమత్తులో వాహనాలను వేగంగా నడుపుతుండడం, ప్రమాదకర ప్రాంతాల్లో సూచిక బోర్డులు లేకపోవడం, రాత్రివేళల్లో పోలీసుల పర్యవేక్షణ కొరవడడం వంటివి రోడ్డుప్రమాదాల సంఖ్య పెరగడానికి కారణాలుగా తెలుస్తున్నది. ఎన్‌హెచ్‌-44, ఎన్‌హెచ్‌-161పై వెలసిన దాబాల్లో మద్యం అమ్మకాలు, సిట్టింగులు యథేచ్ఛగా సాగుతున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

  • కామారెడ్డి జిల్లాలో యేటా సగటున 400కు పైగా రోడ్డుప్రమాదాలు
  • ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు 198 మంది మృత్యువాత
  • జాతీయ రహదారులపై యథేచ్ఛగా మద్యం అమ్మకాలే కారణం
  • రాత్రి వేళల్లో కొరవడిన పోలీసుల పర్యవేక్షణ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా వందలాది మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హైవేలపై అతివేగంగా దూసుకుపోవడం.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో వందలాది కుటుంబాల్లో విషాదం నింపుతున్నది. ప్రమాదాల్లో ఎవరో చేసిన తప్పులకు అమాయకులు బలవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల సంఖ్యను చూస్తే ఆందోళనకరంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 468 ప్రమాదాలు చోటు చేసుకోగా.. 198 మంది మృత్యువాతపడ్డారు. 507 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఒక్క దేవునిపల్లి పోలీసుస్టేషన్‌ పరిధి లోనే అత్యధికంగా 59 ప్రమాదాలు నమోదు కావ డం గమనార్హం. 

హైవేపై మద్యం అమ్మకాల జోరు..

కామారెడ్డి జిల్లాలో రెండు జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. ఎన్‌హెచ్‌ 44 కామారెడ్డి జిల్లా కేంద్రం మీదుగా వెళ్తున్నది. జుక్కల్‌ నియోజకవర్గం మీదుగా ఎన్‌హెచ్‌ 161 విస్తరించి ఉంది. ఈ రెండు జాతీయ రహదారులపై ఇష్టారీతిన వెలిసిన దాబాల్లో మద్యం అమ్మకాలు జోరు అందుకున్నాయి. పట్టపగలే మద్యం ఏరులై పారుతుండడంతో భారీ వాహనాలను నిలిపి మరీ మద్యం సేవిస్తున్నారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పరిస్థితి మరింత ఘోరంగా మారింది. పోలీసులు పగలంతా పెట్రోలింగ్‌ పేరుతో హడావిడి చేసినప్పటికీ.. రాత్రి సమయాల్లో నిఘా పెట్టడం లేదు. మామూళ్ల సంబంధాల నేపథ్యంలో దాబా నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా రెచ్చి పోతున్నారు. జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు నిత్యం సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కానిస్టేబుల్‌ నుంచి పైస్థాయి అధికారి వరకు నిత్యం పోస్టులు పెడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారుల ఉద్దేశం ప్రజా ప్రయోజనార్థం ఉంటే కింది స్థాయిలో ఠాణాల్లో మాత్రం కొంతమంది అధికారుల తీరు అందుకు విరుద్ధంగా ఉండడం గమనా ర్హం. తమ జేబులు నింపుకునేందుకు కొంత మంది పోలీసులు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి దాబా ల్లో ఇష్టారీతిన మద్యం అమ్మకాలకు స్వేచ్ఛను కల్పించారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

రాత్రుల్లో నిఘా కరువు...

రాష్ట్ర రాజధాని భాగ్యనగరం చుట్టూ నిర్మితమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరగడం ఓ పరిపాటిగా మారింది. ఎక్కడో ఒక చోట చిన్నా చితకా ప్రమాదాలు నిత్యకృత్యం. ఔటర్‌పైకి ఎక్కిన వాహన వేగానికి కళ్లెం లేకపోవడంతో గతమంతా ఇష్టారాజ్యంగా సాగేది. ఒకానొక దశలో కొంత మంది రేస్‌లు సైతం నిర్వహించి బొక్కా బోర్లా పడ్డారు. తదనంతరం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని ఇప్పుడు ఆయా చోట్ల ఔటర్‌పై వేగానికి నియంత్రణ చర్యలు చేపట్టారు. గంటకు నిర్ణీత వేగాన్ని దాటితే భారీగా జరిమాన రూపంలో ఇంటికి చిట్టీ రావడం ఖాయమైంది. దీంతో జరిమానాలకు దడుసుకుని వాహనాదారులు ఔటర్‌పై జాగ్రత్తగా వాహనాలు నడుపుతుండడంతో కొంతవరకు ప్రమాదాలు తగ్గాయి. 

దేశంలో అతిపెద్ద జాతీయ రహదారిగా పేరొందిన ఎన్‌హెచ్‌ 44పై అలాంటి చర్యలేమీ లేకపోవడంతో ఇక్కడ ప్రమాదాలు నిత్యం వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై వాహనాల వేగం పరిమితి లేకుండా దూసుకుపోతున్నాయి. రేస్‌గుర్రాల్లా వాహనాలను నడుపుతున్న వారిపై శిక్షలు లేకపోవడంతోనే కామారెడ్డిలో ప్రమాదాలు పెరుగుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రమాదకర ప్రాతాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చైతన్యంతోనే ప్రమాదాల నివారణ

వాహనం కండీషన్‌ ఎలా ఉందో తరచూ చూసుకోకపోవడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్లలో ప్రయాణించే వారు డ్రైవర్‌తో పాటు వాహనంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ సీటు బెల్టును పెట్టుకోవాలి. ముందు ఉన్న రోడ్డుపై దృష్టి పెట్టడంతో పాటు ప్రతి ఐదు సెకన్లకు వెనుక అద్దంలో వెనుక వచ్చే వాహనాలను డ్రైవర్‌ గుర్తించాలి. మద్యం తాగి వాహనం నడపకుండా చూడాలి. డ్రైవర్‌ గుట్కా, పాన్‌ మసాలాలు, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇకపోతే అంతర్గత రోడ్లపై ఆటోల హడావిడితోనూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. అనుమతుల మేరకు ప్రయాణికులను ఎక్కించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమిత వేగంతో నడపకపోవడం, ఫిట్‌నెస్‌ లేని వాహనాల జోరు పెరగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాణిజ్య వాహనాలను నడిపే డ్రైవర్లు అనేక మంది మ ద్యం తీసుకోవడం, గుట్కాలు, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడడమూ రోడ్డు ప్ర మాదాలకు కారణం. బైక్‌ నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలనే నిబంధన ఉన్నా దాన్ని పాటించకుండా ప్రాణాలు కో ల్పోతున్నారు. యువకులు వాహనాలను మితిమీరిన వేగంతో నడుపుతున్నారు. గంటల కొద్దీ వాహనాలను నడుపుతూ విశ్రాంతి లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.logo