KCR | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కొనే దిక్కలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోనగిరిలో బీఆర్ఎస్ అధినేత గురువారం బస్‌యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రాజెక్టుల నీళ్లు ఇచ్చేకాడ నీళ్లు సరిగా ఇవ్వలేదు. అట్ల పంటలు ఎండపెట్టారు. మంచిగ నడిచిన కరెంటును నాశనం చేశారు. మాయమైపోయిన బోరుబండ్లు మళ్లీ ఊళ్లలోకి వచ్చాయి. పూడికలు తీసే క్రేన్లు మళ్లీ ఊళ్లలోకి వచ్చినయ్. ఇది సమంజసమేనా? అటు రైతుబంధు ఇవ్వలేదు. రైతుబీమా కూడా ఉంటదో.. ఊడగొడుతరో తెలియదు. కరెంటు సరిగా ఇవ్వడం లేదు. చివరకు కష్టపడి నాలుగెకరాలు వేసేవాసిన వారికి రెండు ఎకరాలు పండితే, ఐదెకరాలు వేసిన వారికి ఎకరం పండితే.. ఇవాళ కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోతే కొనే దిక్కులేదు’ అంటూ ధ్వజమెత్తారు.
‘తడిసిపోయేకాడ తడిసిపోతుంది. ధర సరిగా ఇవ్వడం లేదు. మిల్లర్ల కమీషన్లు దొబ్బారు. వాళ్లు కొనడానికి ముందుకురావడం లేదు. ఇలా కొనుగోళ్లను గోల్మాల్ చేశారు. నాలుగైదు నెలల కింద మంచిగా ఇంట్లో ఉండి కరెంటుపెట్టుకొని.. తెల్లారి పొలం చూసుకున్న రైతులు మళ్లీ పాములు, తేళ్లు కరువంగా రాత్రిపూట మోటార్లు పెట్టే దుర్మార్గ పాలన కాంగ్రెస్ తీసుకువచ్చింది. తొమ్మిదేళ్లు కరెంటు ఇచ్చిండు కదా కేసీఆర్. కేసీఆర్ పక్కకు జరుగంగనే కట్క బంద్ చేసినట్లుగా కరెంటు మాయమైతదా? ఈ మాత్రం వీళ్లకు చేతనైతలేదా వీళ్లకు. తొమ్మిదేళ్లు నడ్వనే నడిచే.. తొవ్వ పడనే పడే. పడ్డ తొవ్వలో నడువస్తలేదా? మరి వీళ్లను దద్దమ్మలు అనకపోతే ఏమనాలే?’ అని ప్రశ్నించారు.
‘తెలంగాణలో 2014కు ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేది. వలసలు పోయేవారు. మొత్తం బంద్ అయ్యేలా చేశాం. భగవంతుడి దయతో ఆత్మహత్యలు బందయ్యాయి. సంతోషపడ్డం మంచిగైంది తెలంగాణ అని. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినకాడి నుంచి రాత్రిపూట కరెంటుపెట్ట సచ్చిపోయినోళ్లు.. పొలం ఎండిపోతే గుండె ఆగి చనిపోయినోళ్లు 225 మంది చనిపోయారు. ముఖ్యమంత్రిగారూ పరామర్శించమంటే.. వాళ్ల కుటుంబాలను ఆదుకోమన్నాం. మనం ఉన్నప్పుడు దర్జాగా రైతుబీమా పెట్టాం. ఎవరైనా రైతు చనిపోతే వారంలోగా వాళ్ల ఇంటికి రూ.5లక్షల వచ్చినయ్. మీరు వెళ్లి పోయి సముదాయించండి అంటే.. ముఖ్యమంత్రి పోడు. మంత్రులు పోరు. ఎమ్మెల్యేలు పోరు. రైతులంటే మీకు కనిపించడం లేదు. అంత అగ్గువ అయిపోయారా? అంత అధ్వాన్నం అయిపోయారా?’ అంటూ నిలదీశారు.
‘ముఖ్యమంత్రి ఏమంటున్నడు.. 48 గంటల్లో పేర్లు పంపియ్.. నిజమే అయితే ఆదుకుంటా అన్నడు. నేను నాలుగు గంటల్లోనే పంపిన. ఫొటోలు, ఫోన్ నంబర్లతో సహా పంపాను. ఎవరూ పోలేదు. ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే ఎవరూ పోలేదు పరామర్శించలేదు. రైతులకు ఏం బాధ ఇది. నా రైతులకు ఈ బాధ. నేను మంచిగ చేసుకున్న తెలంగాణ. పంటలు మంచిగ పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి. ఇప్పుడు నా కండ్ల ముందటే ఎండిపోతే.. యుద్ధం చేయాలా? మరి ఏం చేయాలి? అందరి కలిసి పోరాడుదామా?’ అని ప్రశ్నించగా.. పోరాడుదాం అంటూ జనం నినదించారు.