Serial Killer : క్యాబ్ డ్రైవర్లే (Cab drivers) లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ (Delhi crime branch) పోలీసులకు చిక్కాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన అజయ్ లాంబా (Ajay Lamba) 2001లో జరిగిన నలుగురు క్యాబ్ డ్రైవర్ల హత్య కేసులలో నిందితుడిగా ఉన్నాడు.
అజయ్ లాంబా మరో ఇద్దరితో కలిసి 2001లో క్యాబ్ డ్రైవర్లే లక్ష్యంగా హత్యలకు పాల్పడ్డాడు. అతడిపై నాలుగు హత్య కేసులో నమోదయ్యాయి. దాంతో 2008 వరకు అతడు ఇక్కడే పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. 2008లో కుటుంబంతో సహా నేపాల్‌కు వెళ్లి 2018 వరకు అక్కడే ఉన్నాడు. 2018లో భారత్‌కు వచ్చి మళ్లీ నేరాలు మొదలుపెట్టాడు.
2020లో ఒడిశా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చి 2021లో ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టయ్యాడు. మళ్లీ అరెస్టై మళ్లీ బెయిల్‌పై వచ్చాడు. 2024లో ఢిల్లీలో జ్యుయెలరీ షాపులో దోపిడీకి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.
అయితే ఇన్నిసార్లు అరెస్టయినా అజయ్ లాంబా 2001లో నలుగురు క్యాబ్ డ్రైవర్లను హత్య చేసిన విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. తాజాగా పోలీసులు అతడే సీరియల్ కిల్లర్ అని గుర్తించారు. అజయ్ లాంబా తన ఇద్దరు సహచరులతో కలిసి ఉత్తరాఖండ్‌కు క్యాబ్ మాట్లాడుకునే వారని, అక్కడ డ్రైవర్‌ను హత్య చేసి అతడి దగ్గరున్న నగదు, నగలు లాక్కుని, క్యాబ్‌ను నేపాల్‌కు తరలించి అమ్ముకునే వారని పోలీసులు తెలిపారు.
ఇలా ఒక ఏడాదిలోనే నాలుగు హత్యలు చేశారని పోలీసులు వెల్లడించారు. ఆ నలుగురిలో ఒక్కరి మృతదేహం మాత్రమే లభ్యమైందని, మిగతా మృతదేహాలు లభ్యం కాలేదని చెప్పారు. అజయ్ లాంబా అండ్ గ్యాంగ్ ఇంకా ఎక్కువ మందినే హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అన్నారు.