Army Doctor : పురిటి నొప్పులు భరించలేక రైల్వే స్టేషన్ (Railway station) లో అల్లాడుతున్న ఓ గర్భిణికి అక్కడే ఉన్న ఓ ఆర్మీ డాక్టర్ (Army doctor) డెలివరీ చేసి ప్రాణాలు నిలబెట్టాడు. ఎలాంటి పరికరాలు లేకపోయినా కేవలం హెయిర్ క్లిప్ (Hair clip), పాకెట్ నైఫ్ (Packet knife) తో డెలివరీ చేసి తల్లీబిడ్డలను బతికించాడు. దాంతో డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నార్త్ సెంట్రల్ రైల్వేస్ (North Central Railway) లోని ఝాన్సీ డివిజన్ (Jhansi Division) లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరమధ్య రైల్వేలోని ఝాన్సీ డివిజన్ పబ్లిక్ రిలేషన్ అధికారి మనో కుమార్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ గర్భిణి పాన్వెల్-ఘోరఖ్పూర్ రైలులో ప్రయాణిస్తుండగా ఆమె తీవ్రమైన పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆస్పత్రికి తరలించడం కోసం ఝాన్సీ రైల్వేస్టేషన్లో ఆమెను కిందకు దించారు. రైలు దిగగానే వీల్‌చైర్‌లో లిఫ్టు దగ్గరకు తీసుకెళ్లగా నొప్పి తీవ్రమై విలవిల్లాడుతూ ఆమె కింద పడిపోయింది.
అది చూసి అక్కడే హైదరాబాద్ వెళ్లే రైలు కోసం వేచిచూస్తున్న ఆర్మీ వైద్యుడు మేజర్ డాక్టర్ రోహిత్ బచ్వాలా (31) స్పందించాడు. రైల్వే సిబ్బంది సాయంతో ఆమెకు ప్లాట్‌ఫామ్‌పైనే అత్యవసరంగా డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వే సిబ్బంది తమ దగ్గరున్న సామాగ్రితో చాటు ఏర్పాటు చేయగా.. వైద్యుడు కేవలం హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్‌తో డెలివరీ చేశాడు.
డెలివరీ అనంతరం తల్లీబిడ్డ క్షేమం అని నిర్ధారించుకున్న తర్వాత హెయిర్ క్లిప్‌తో బొడ్డుతాడును లాక్ చేసి, పాకెట్ నైఫ్‌తో దాన్ని కత్తిరించాడు. సదరు గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తన రైలు రావడంతో హైదరాబాద్‌కు వచ్చాడు. కాగా సమయానికి స్పందించి తల్లీబిడ్డల ప్రాణాలు నిలబెట్టిన ఆర్మీ డాక్టర్‌పై రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.