F-35 flight : సాంకేతిక కారణాలతో గత మూడు వారాలుగా కేరళ (Kerala) లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్టు (Airport) లో నిలిచిపోయిన బ్రిటన్ రాయల్ నేవీ (Britain Royal Navy) కి చెందిన యుద్ధ విమానం ఎఫ్-35బి (F-35B) ఎట్టకేలకు కదిలింది. ఆ విమానం మరమ్మతుల కోసం నిపుణులు దానిని హ్యాంగర్‌కు తగిలించి పార్క్ చేసిన ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించారు.
ఆ ఫైటర్ జెట్‌కు మరమ్మతులు చేసేందుకు యూకే నుంచి 24 మంది ఏవియేషన్ ఇంజినీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో ఆదివారం కేరళకు చేరుకుంది. ఆ విమానానికి మరమ్మతులు చేసేందుకు దానిని హ్యాంగర్‌కు తగిలించి తరలించారు. విమానం మరమ్మతు ఇక్కడ పూర్తవుతుందా లేదా అనే సంగతిని బ్రిటన్ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఇక్కడే మరమ్మతు పూర్తయితే ఆ విమానం స్వయంగా బ్రిటన్‌కు వెళ్లనుంది.
ఒకవేళ ఇక్కడ మరమ్మతు పూర్తయ్యే అవకాశం లేకపోతే దాన్ని సీ-17 గ్లోబ్‌మాస్టర్ అనే రవాణా విమానంలో బ్రిటన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళ విమానాశ్రయంలో మూడు వారాలుగా ఉన్న ఫైటర్ జెట్ ఎఫ్-35బి విమానానికి భారీ భద్రత కల్పించామని, సాయుధ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది కాపలాగా ఉన్నారని భారత అధికారులు తెలిపారు.
కాగా గత నెల ఇండో-యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్-35బి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆ విమానాన్ని జూన్ 14న అర్ధరాత్రి తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఆ ఫైటర్ జెట్‌లో ఇంజినీరింగ్ సమస్య తలెత్తినట్లు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు. ఆ విమానానికి మరమ్మతులు చేయడానికి అదేరోజు రాత్రి ఏడబ్ల్యూ 101 మెర్లిన్ హెలికాఫ్టర్‌లో నిపుణులు వచ్చారు. మరమ్మతులు చేసినా విమానం మొరాయించింది. అప్పటి నుంచి తిరువనంతపురం ఎయిర్‌పోర్టులోనే ఉంది. ఇప్పుడు పరికరాలతో సహా 24 మంది స్పెషల్ ఎక్స్పర్ట్స్ బృందం వచ్చి విమానం రిపెయిర్కు ప్రయత్నిస్తోంది.