Dalai Lama : టిబెటన్ ఆధ్యాత్మిక గురువు (Spiritual leader) దలైలామా (Dalai Lama) కు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సహనం, నైతిక క్రమశిక్షణకు దలైలామా చిహ్నమని అన్నారు. ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలైమా 90వ పుట్టినరోజు సందర్భంగా మోదీ శనివారం తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా దలైలామా 1935లో టిబెట్‌లోని టక్సెర్లో జన్మించారు. 1959లో టిబెట్‌ను చైనా ఆక్రమించిన తర్వాత భారత్‌లో ఆశ్రయం పొంది అప్పటి నుంచి ధర్మశాలలో నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింస, మానవతా విలువలను ప్రచారం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. దలైలామా జన్మదినం సందర్భంగా మెక్లియోడ్ గంజ్‌లోని టిబెటన్లు ఆదివారం నుంచి వారం రోజులపాటు ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటారు.
దలైలామా జన్మదిన వేడుకల్లో భాగంగా మతపరమైన సమావేశం, యువజన వేదిక, చలనచిత్ర ప్రదర్శన, టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దీర్ఘాయుష్షు కోసం ప్రార్థనలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే దలైలామా తన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచానికి ఓ సందేశాన్ని అందించారు. మానవ విలువలు, మత సామరస్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తూనే ఉంటానని చెప్పారు.