Oscars 2026 | ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా గుర్తింపు పొందిన ఆస్కార్ వేడుకలకు ఈసారి టీవీ ప్రేక్షకాదరణ కొంత తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. 98వ ఆస్కార్ అవార్డుల ప్రసారానికి గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చిన రేటింగ్స్ ఈ ఏడాది మళ్లీ తగ్గుముఖం పట్టడం గమనార్హం. ప్రముఖ హోస్ట్ కోనన్ ఓ’బ్రియన్ సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన గణాంకాలను వాల్ట్ డిస్నీ సంస్థ విడుదల చేసింది. గత ఆదివారం నిర్వహించిన ఆస్కార్స్ 2026 వేడుకను ఏబీసీ టీవీ ఛానల్, హులు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కలిపి సుమారు 17.9 మిలియన్ల మంది వీక్షించారు. అంటే దాదాపు ఒక కోటి 79 లక్షల మంది ఈ కార్యక్రమాన్ని చూసినట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది జరిగిన ఆస్కార్ వేడుకను సుమారు 19.7 మిలియన్ల మంది వీక్షించారు. దీంతో ఈసారి మొత్తం వ్యూయర్షిప్లో దాదాపు 9 శాతం తగ్గుదల నమోదైంది.
ఈ ఏడాది ఆస్కార్ వేడుకలకు ముఖ్యంగా యువత దూరంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు గల ప్రేక్షకులలో దాదాపు 14 శాతం తగ్గుదల కనిపించింది. ఇది టీవీ ప్రేక్షకాదరణ తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల రేసులో వార్నర్ బ్రదర్స్ నిర్మించిన రెండు చిత్రాలు “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్” మరియు “సిన్నర్స్” మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు వంటి ప్రధాన విభాగాల్లో “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్” అవార్డులు దక్కించుకుంది. ఇక ఆస్కార్ చరిత్రలో అత్యధికంగా 16 నామినేషన్లు పొందిన “సిన్నర్స్” చిత్రంలో నటించిన మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.
టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వ్యూయర్షిప్ తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆస్కార్స్ 2026 భారీ స్పందనను సొంతం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే సోషల్ మీడియా ఇంప్రెషన్స్ 42 శాతం పెరిగాయి. అకాడమీ అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో వీడియో వీక్షణలు 129 మిలియన్లకు పైగా నమోదయ్యాయి. అదేవిధంగా 2025-2026 సీజన్లో ఇప్పటివరకు నంబర్ 1 ప్రైమ్‌టైమ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌గా ఆస్కార్స్ 2026 నిలవడం విశేషం. ఒకప్పుడు ఆస్కార్ వేడుకలను 50 మిలియన్ల మందికి పైగా వీక్షించేవారు. 1998లో “టైటానిక్” చిత్రం విజయం సాధించిన సమయంలో అత్యధికంగా 57.2 మిలియన్ల మంది ఈ వేడుకను చూశారు. అయితే కాలక్రమేణా ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లడంతో టీవీ రేటింగ్స్ తగ్గుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో 2021లో ఈ సంఖ్య 10.4 మిలియన్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.