టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లో జరిగి ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. షియా ముస్లిం క్యాలెండర్లో అతి ముఖ్యమైన రోజు అయిన అషురా(మొహర్రం)ను జరుపుకుంటున్న హాలులోకి ఖమేనీ ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇరాన్ స్టేట్ టీవీ ప్రసారం చేసింది. సాంప్రదాయ నల్లని వస్త్రాలు ధరించిన ఆయన ప్రజల హర్షధ్వానాల మధ్య, అందరినీ పలకరిస్తూ అందులో కనిపించారు. ప్రతి ఏడాది ఖమేనీ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటారు. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ ముగిసిన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయనను చూసి జనాలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.
📹 لحظه ورود رهبر انقلاب به حسینیه امام خمینی(ره) در مراسم عزاداری شب عاشورای حسینی#عاشورا pic.twitter.com/09mfwm3qFM
— خبرگزاری تسنیم 🇮🇷 (@Tasnimnews_Fa) July 5, 2025
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజులపాటు సాగిన యుద్ధం జూన్ 24న ముగిసింది. ఇదరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం కుర్చుకోవడంతో యుద్ధానికి తెరపడింది. అయితే ఖమేనీ మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఖమేనీ సురక్షితమైన బంకర్లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన ఫ్యామిలీతో కలిసి అత్యంత సురక్షితమైన బంకర్లో ఖమేనీ తలదాచుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే, కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి.. యుద్ధం ముగిసినప్పటికీ ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ‘ఖమేనీ ఎక్కడ..?’ అంటూ ఇరాన్ ప్రజలు, నేతల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో వీడియో ద్వారా దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు.