రాజన్న సిరిసిల్ల, మార్చి10 : ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం స్వచ్చత .. పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ హాజరై తనిఖీ చేశారు. పలు విభాగాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యాలయంలోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్స్ సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు. అనవసరమైనవి తొలగించాలని సూచించారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తొలగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న కుండీల్లో మొక్కలు పెట్టించాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.