కారేపల్లి, ఆగస్టు 19 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో గల ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర.ఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో తిరిగి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రవేశాలు, వారికి అందిస్తున్న ఆహారం, ఫలితాల పట్ల ఆరా తీశారు. తరగతి గదుల్లోకి వెళ్లి బోధన తీరును పరిశీలించారు. ల్యాబ్, లైబ్రరీ, వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల వరకు ఖమ్మం-చీమలపాడు ఆర్టీసీ బస్సును నడపాలని, నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పాఠశాల భవనం ప్రహరిపై సోలార్ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయాలని, పాఠశాల ప్రాంగణంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సంబంధిత ప్రతిపాదనలను తనకు పంపాలని సూచించారు.