మునిపల్లి, సెప్టెంబరు 28 : రోడ్డు కరాబ్ అవుతుంది.. ఊరి బయట నుంచి వెళ్లండి అని భారీ వాహనాలను అడ్డుకున్నందుకు దళితులపై కొందరు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే దళితులను దుర్భాషలాడుతూ కొట్టారు. ఈ ఘటనలో దళిత ఉప సర్పంచ్ భర్త, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రేమ్‌తోపాటు పలువురికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట గ్రామ శివారు నుంచి మండలంలోని మల్లిఖార్జునపల్లి గ్రామం వరకు వ్యవసాయ పొలాల్లో నుంచి నూతనంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు అవసరమైన ఇసుక, కంకర, మొరం, సిమెంట్ వివిధ పరికరాలను తరలిస్తున్న భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. అధిక లోడ్‌తో భారీ వాహనాలు గ్రామంలో నుంచి వెళ్తుండటంతో రోడ్డు దెబ్బతింటున్నదని.. గ్రామం బయట నుంచి వెళ్లాలని స్థానికులు వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వట్పల్లి మండలం నుంచి కొంతమంది మల్లారెడ్డిపేట గ్రామానికి తరలివచ్చి వాహనాలు అడ్డుకున్న దళితులతో గొడవకు దిగారు. పోలీసుల ముందే దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. ఇలా వారు దౌర్జన్యంగా కొడుతున్నప్పటికీ పోలీసులు సినిమా చూస్తూ ఉండిపోవడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.
భారీ వాహనాలను అడ్డుకున్న వారిలో మల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ భర్త, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రేమ్ కూడా ఉన్నారు. “మా వాహనాలను ఎందుకు ఆపుతావు?” అంటూ కొందరు ఆయనపై దాడి చేశారు. ఇష్టానుసారంగా కొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి.
ఈ ఘటన మునిపల్లి ఎస్ఐ అరవింద్ సమక్షంలోనే జరిగినా దాడిని అడ్డుకోవడంలో పోలీసులు స్పందించలేదని స్థానికులు తెలిపారు. బయట ప్రాంతం నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసుల ముందే గ్రామంలో తిరుగుతూ హల్చల్ చేశారు.
దాడిలో గాయపడిన దళితులను సోమవారం తెల్లవారుజామున పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులనే స్టేషన్‌కు పిలిపించడంపై దళితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు తమ ముందే జరిగిన దాడిని అడ్డుకోకపోవడంపై దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ ఎన్నికైన నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలోని వ్యవసాయ భూములకు బడా వ్యాపారులు ప్రైవేట్ రోడ్డు వేసుకుంటుండటంతో తమకు అడ్డు ఉండొద్దనే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, పై అధికారుల నుంచి ఒత్తిళ్లు తీసుకొచ్చారనే చర్చ స్థానికంగా జరుగుతోంది.