Ravi Barsur | సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన రవి బస్రూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించి తనదైన ముద్ర వేసిన ఆయన, తాజాగా ‘కల్ట్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో తన జీవితంలోని చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కల్ట్’. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ లో శనివారం టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వక్ సేన్‌తో పాటు తరుణ్ భాస్కర్ , రవి బస్రూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ, “ఈ సినిమాకి తరుణ్ భాస్కర్, రవి బస్రూర్ నా రెండు కళ్లు” అని అన్నారు. స్టేజ్‌పైనే రవి బస్రూర్‌కు ఖరీదైన రోలెక్స్ గోల్డ్ వాచ్‌ను బహుమతిగా అందించి పాదాభివందనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గౌరవానికి రవి బస్రూర్ ఎమోషనల్ అయ్యారు.
తన 25 ఏళ్ల కెరీర్లో అందరూ తనలోని టాలెంట్‌ను మాత్రమే చూశారని, కానీ మొదటిసారి తన ఆత్మను గుర్తించిన వ్యక్తి విశ్వక్ సేన్ అని రవి తెలిపారు. “మంచి మ్యూజిక్ ఇవ్వడానికి నేను 24 గంటలు పనిచేస్తాను. కానీ మొదటిసారి నా సోల్‌ను, సంగీతం పట్ల నాకున్న అంకితభావాన్ని గుర్తించారు. ఇది కేవలం వాచ్ కాదు… ఇది ప్రతి మ్యూజిషియన్కు దక్కిన గౌరవం” అని చెప్పారు. అంతేకాకుండా తన జీవితంలోని అత్యంత కష్టకాలాన్ని కూడా రవి గుర్తుచేశారు. నాకు 18 ఏళ్ల వయసులో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. రెండోసారి ఒక వ్యక్తి నన్ను కాపాడి, కీబోర్డు కొనుక్కోవడానికి రూ.35,000 ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరు రవి. అప్పటి నుంచి నా పేరు రవి బస్రూర్‌గా మార్చుకున్నాను. నా చివరి ఊపిరి వరకు క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది అని చెప్పారు.
ఇక విశ్వక్ సేన్ గురించి మాట్లాడుతూ, “నా జర్నీని, నా ఆత్మను గుర్తించిన వ్యక్తి ఇతనే. జీవితాంతం ఇతనికి కృతజ్ఞుడిని. ‘కల్ట్’ మామూలు సినిమా కాదు” అని అన్నారు. ఇదిలా ఉంటే, రవి బస్రూర్‌కు హైదరాబాద్‌లో ఇల్లు ఉందని, అది తన ఇల్లు అన్నట్టేనని విశ్వక్ సేన్ చెప్పడం ఈ ఈవెంట్లో మరో హైలైట్‌గా నిలిచింది.