Rahul Gandhi : బీజేపీ (BJP) పైనా, బీహార్ (Bihar) లోని నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వంపైనా కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తంచేశారు. బీహార్ రాజధాని పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. నితీశ్ కుమార్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని గూండాల రాజ్యంగా మార్చాయని మండిపడ్డారు.
ఇప్పుడు బీహార్ దోపిడీ, కాల్పులు, హత్యల నీడలో ఉందని, రాష్ట్రంలో నేరాలు జరగడమనేది సాధారణంగా మారిపోయిందని రాహుల్‌గాంధీ విమర్శించారు. నేరాలను నిర్మూలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర పౌరులను రక్షించలేని పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలెవరూ ఓటు వేయొద్దని సూచించారు.
దారుణాలను, దోపిడీలను పూర్తిగా నిర్మూలించి, పురోగతివైపు అడుగులు వేసే సమయం బీహార్‌కు వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేసే ఓట్లు కేవలం ప్రభుత్వ మార్పు కోసమేగాక రాష్ట్రాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయనే విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
కాగా పట్నాలోని గాంధీమైదాన్ ఠాణా పరిధిలోగల రామ్గులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో గోపాల్ ఖేమ్కా దారుణహత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో తన ఇంటికి చేరుకున్న ఆయన కారు దిగుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఖేమ్కా అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ హత్య బీహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ స్పందించారు. దుండగులు గోపాల్ ఖేమ్కాను పట్నా నడిబొడ్డున హత్యచేస్తే.. అక్కడికి పోలీసులు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టిందని విమర్శించారు. ఆరేళ్ల క్రితం వ్యాపారవేత్త ఖేమ్కా కుమారుడిని ఇదేవిధంగా హత్యచేస్తే ఇప్పటికీ ఆ హంతకులను అరెస్టు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.