Bandla Ganesh | ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన, క్రమంగా కమెడియన్‌గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరోలకు ఫ్రెండ్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో, స్క్రీన్‌పై కనిపించే ప్రతిసారి వినోదాన్ని పంచే నటుడిగా పేరు సంపాదించారు. అభినయంతో పాటు సినీ నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టిన బండ్ల గణేష్, నిర్మాతగా కూడా మంచి స్థాయిని అందుకున్నారు. ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన ఆయన, తర్వాత వరుసగా పెద్ద సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్లో తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
ముఖ్యంగా తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరు అమ్మాయిలతో, టెంపర్ వంటి భారీ చిత్రాలను నిర్మించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ చిత్రం ఘన విజయం సాధించడం ఆయన కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలిచింది. గత కొంతకాలంగా సినీ నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల గణేష్ ఇటీవల మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. “బీజీ బ్లాక్‌బస్టర్స్” పేరుతో రెండో నిర్మాణ సంస్థను ప్రారంభించి, కొత్త దర్శకులు మరియు కొత్త నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త కథలతో, కొత్త టాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని యూనిట్‌తో చేసిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను సినిమాల్లో ఎక్కువగా నటించడానికి సమయం లేదని తెలిపారు. “నా కింద వెయ్యి మంది పని చేస్తున్నారు. నేను సినిమాల్లో ఎక్కువగా నటిస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది. అందుకే నటనకు దూరంగా ఉంటున్నాను” అని ఆయన స్పష్టం చేశారు. అయితే మంచి పాత్ర వస్తే మాత్రం తప్పకుండా నటిస్తానని బండ్ల గణేష్ చెప్పారు. “పాత్ర నా మనసుకు నచ్చాలి. అలాంటి రోల్ వస్తే ఖచ్చితంగా చేస్తాను” అని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ప్రస్తుతం తాను మెగాస్టార్ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. చిరంజీవి-బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తాను ఆసక్తికర పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఇంకా ఒక ప్రత్యేకమైన పాత్రను చేయాలనే కోరిక తనకు చాలా కాలంగా ఉందని బండ్ల గణేష్ చెప్పారు. ఆ పాత్రను తన బ్యానర్లోనే నిర్మించే సినిమాలో చేసి, ఖచ్చితంగా హిట్ సాధిస్తానని ఆయన నమ్మకంగా తెలిపారు