Toxic | కన్నడ సినీ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. స్టైలిష్ మేకింగ్, డార్క్ టోన్, ఇంటెన్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌తో కలిసి కథ, రచనలో కూడా భాగస్వామ్యం కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. వెంకట్ కె. నారాయణతో కలిసి యశ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతూ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ కేవలం 1 నిమిషం 56 సెకన్ల నిడివి ఉన్నప్పటికీ భారీ సంచలనం సృష్టించింది. యశ్ ట్రాన్స్ఫర్మేషన్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. యూట్యూబ్‌లో భారత్‌తో పాటు శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఒమాన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచి సినిమా గ్లోబల్ రీచ్‌ను నిరూపించింది. అభిమానులు ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషణలు చేస్తూ కథపై పలు థియరీలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే ఇప్పటికే గడ్డం లుక్‌లో ‘రాయా’ పాత్ర వైరల్ కాగా, తాజాగా విడుదలైన ‘టికెట్ టు హెల్’ పోస్టర్ మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇందులో యశ్ పూర్తిగా క్లీన్-షేవ్ లుక్‌లో కనిపిస్తూ షాక్ ఇచ్చారు. ఈ లుక్‌లో ఆయన పోషిస్తున్న ‘టికెట్’ అనే పాత్రను పరిచయం చేశారు. రెండు భిన్నమైన గెటప్స్ బయటకు రావడంతో సినిమాలో యశ్ డబుల్ రోల్లో కనిపించే అవకాశాలపై చర్చలు జోరందుకున్నాయి.
ప్రత్యేకంగా చెప్పాలంటే, తన ఐకానిక్ గడ్డాన్ని తొలగించి పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా మారింది. లుక్ సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ పాత్రలో దాగి ఉన్న మిస్టరీ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్ ఆర్ట్స్, రీల్స్, థియరీ పోస్టులతో సోషల్ మీడియాలో ‘టాక్సిక్’ మేనియా కొనసాగుతోంది. స్టైలిష్ విజువల్స్, యశ్ డ్యూయల్ షేడ్స్, గీతూ డైరెక్షన్ అన్నీ కలిపి ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య నిలబెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాలో మితిమీరిన హింస, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఫ్యామిలీ ప్రేక్షకులు కొంతవరకు దూరంగా ఉండే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.