‘మా ‘దండోరా’ సినిమాను గుర్తించి అవార్డులిచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికీ ధన్యవాదాలు. ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంది. దర్శకుడు మురళీకాంత్ ఈ సినిమాను మా కోసమే తీశాడనిపిస్తుంది. ఈ పాత్ర కోసం, లుక్ కోసం చాలావరకూ రాత్రిపూట రెండుమూడు గంటలే నిద్రపోయేవాడ్ని. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా చేసేవాడ్ని కాదు. ఇది ఇక్కడితో ఆగే సినిమా కాదు. ఇంకా ఎన్నో అవార్డులను ఈ సినిమా అందుకోనుంది’ అని నటుడు శివాజీ నమ్మకం వ్యక్తం చేశారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘దండోరా’. రూరల్ తెలంగాణ నేపథ్యంలో కుల వివక్షల కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకుడు.
రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ చిత్రం రాష్ట్రప్రభుత్వ తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డులు 2025లో సత్తా చాటింది. మూడు కేటగిరీల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థాంక్స్మీట్లో శివాజీ మాట్లాడారు. తాను కొత్తవాడ్నయినా ఈ టీమ్ తననెంతో నమ్మిందని, శివాజీ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చిందని, ఈ గుర్తింపు మరిన్ని మంచి సినిమాలు తీయాలనే ఉత్సాహాన్నిచ్చిందని దర్శకుడు మురళీకాంత్ అన్నారు. ఇంకా నిర్మాత రవీంద్ర బెనర్జీ, సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్, నటుడు నందు, నటి మనికారెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ కూడా మాట్లాడారు.