Prabhudeva | భారతీయ సినీ పరిశ్రమలో డ్యాన్స్‌కు కొత్త నిర్వచనం చెప్పిన లెజెండరీ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈసారి ఆయన వార్తల్లో నిలవడానికి కారణం ఏ సినిమా కాదు.. తన కుమారుడు రిషి రాఘవేందర్ దేవాతో కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియో. సముద్ర తీరంలో తండ్రీకొడుకులు కలిసి వేసిన మాస్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభుదేవా తన కుమారుడు రిషితో కలిసి బీచ్‌లో సరదాగా గడిపిన సమయంలో, తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘కాదలన్’ (తెలుగులో ‘ప్రేమికుడు’) సినిమాలోని సూపర్ హిట్ ‘పేట్టా రాప్’ పాటకు డ్యాన్స్ చేశారు. ఒకే రకమైన స్టెప్పులు, అద్భుతమైన సమన్వయం, ఎనర్జీతో ఇద్దరూ చేసిన ప్రదర్శన అభిమానులను ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా రిషి రాఘవేందర్ దేవా స్టెప్పుల్లో కనిపించిన గ్రేస్, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ చూసిన నెటిజన్లు.. “తండ్రికి తగ్గ తనయుడు”, “ప్రభుదేవా వారసత్వాన్ని రిషి అద్భుతంగా కొనసాగిస్తున్నాడు”, “డ్యాన్స్ జీన్స్ అంటే ఇవే” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుదేవా ప్రముఖ కొరియోగ్రాఫర్ ముగూర్ సుందర్ (సుందరం మాస్టర్), మహాదేవమ్మ దంపతులకు కర్ణాటకలోని మైసూరులో జన్మించారు. ఆయన సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా ప్రముఖ కొరియోగ్రాఫర్లు, నటులుగా గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచే నృత్య కళలో శిక్షణ పొందిన ప్రభుదేవా, తన అసాధారణ ప్రతిభతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
1989లో కమల్ హాసన్ నటించిన ‘వెట్రి విజా’ చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా సినీ ప్రయాణం ప్రారంభించిన ప్రభుదేవా, వందలాది చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. ‘ప్రేమికుడు’, ‘మెరుపు కలలు’ చిత్రాల్లోని వినూత్న డ్యాన్స్ కంపోజిషన్లకు ఆయన రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. 1994లో విడుదలైన ‘ప్రేమికుడు’ సినిమాతో హీరోగా మారిన ప్రభుదేవా, తన డ్యాన్స్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని “ఇండియన్ మైకేల్ జాక్సన్” అనే గుర్తింపు పొందారు. అనంతరం బాలీవుడ్లో ‘ABCD’, ‘ABCD 2’ వంటి డ్యాన్స్ ప్రధాన చిత్రాల్లో నటించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2005లో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన ప్రభుదేవా, తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తర్వాత బాలీవుడ్లో ‘వాంటెడ్’, ‘రౌడీ రాథోర్’, ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ వంటి భారీ విజయాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘శంకర్ దాదా జిందాబాద్’, ‘పౌర్ణమి’ వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.