న్యూఢిల్లీ, మార్చి 8: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఈ నెల 1 నుంచి 7 వరకు గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మంది భారతీయులు సురక్షితంగా భారత్కు తిరిగి వచ్చేశారని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) శనివారం తెలిపింది. వీరిలో 32,107 మంది ఇండియన్ ఎయిర్లైన్స్ ద్వారా, మిగిలిన వారు ఇతర వాణిజ్య, నాన్ షెడ్యూల్డ్ విమానాల ద్వారా భారత్కు చేరుకున్నారని తెలిపింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు దీని ద్వారా సహాయం అందజేస్తున్నట్టు ఎంఈఏ వివరించింది. అక్కడ ఉండిపోయిన భారతీయులు స్థానిక అధికారులు, దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు ఇచ్చే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.