Crime news : ఇప్పటికే ఒక హత్య కేసులో జీవితఖైదు (Life sentence) పడిన వ్యక్తి బెయిల్‌పై బయటికి వచ్చి అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హర్యానా (Haryana) రాష్ట్రం ఝజ్జర్ జిల్లా (Jhajjar district) బహదూర్గఢ్ (Bahadurgarh) మున్సిపాలిటీలోని పటేల్‌నగర్ (Patel Nagar) ఏరియాకు చెందిన మన్జీత్ (Manjeet) అలియాస్ మంజా (Manja) 2009లో ఓ హత్య కేసులో అరెస్టయ్యాడు.
అతడితోపాటు అరుణ్ దబాస్ అలియాస్ బిట్టు అనే వ్యక్తికి కూడా జీవితఖైదు పడింది. ఈ ఇద్దరూ కలిసి తమతో కలిసి నేరాలు చేసే మరో వ్యక్తిని హత్య చేశారు. ఈ కేసు విచారించిన చండీగఢ్ హైకోర్టు 2012లో నిందితులిద్దరినీ దోషులుగా తేల్చి జీవితఖైదు విధించింది. ఆ తర్వాత 2015లో మంజా బెయిల్‌పై బయటికి వచ్చాడు.
ఇప్పటికే ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్నా అతడు తన ప్రవర్తనను మార్చుకోలేదు. గత నెలలో ఢిల్లీలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు జూన్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం గాలింపుచేపట్టారు. అయితే 20 రోజులకుపైగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న మంజా ఈ నెల 3న పట్టుబడ్డాడు.
హర్యానాలోని తన స్వస్థలానికి నిందితుడు వచ్చినట్లు తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు అక్కడికి వెళ్లి హర్యానా పోలీసుల సాయంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆదివారం మీడియాకు వెల్లడించారు. నిందితుడిపై గతంలో ఉన్న పెండింగ్ కేసుల గురించి కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు.