Vijaya Dairy | విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్ కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారంటూ తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మేఘన ఫుడ్స్ అనే సంస్థకు విజయ డెయిరీ ఫ్రాంచైజీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సంస్థ గుజరాత్‌లోని కన్హాన్ డెయిరీ నుంచి నెయ్యిని సేకరించి తెలంగాణలో విక్రయిస్తుందని పేర్కొన్నారు. ఈ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు.
విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో హైదరాబాద్ మార్కెట్లో నెలకు 100 టన్నులకు పైగా నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయని అమిత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విజయ డెయిరీకి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఏపీకి చెందిన ప్రైవేట్ యూనియన్లు ఇక్కడ తక్కువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నాయని మండిపడ్డారు. దీని బదులుగా APDDCFకు కేవలం చిన్న రాయల్టీ అంటే లీటర్ పాలు అమ్మకాలపై ఫెడరేషన్‌కు రూ.1 మాత్రమే వస్తుందని.. రైతులకు, కో-ఆపరేటివ్స్‌కు పెద్దగా లాభం లేదని అన్నారు. దీని వల్ల తెలంగాణ, ఏపీ పాడి రైతులకు రావాల్సిన ఆదాయం గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
డెయిరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్లను వాడుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై ఏపీ డెయిరీకి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు.