హైదరాబాద్ సిటీబ్యూరో/కొండాపూర్, మార్చి 7(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని, స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో శనివారం గ్రేటర్ హైదరాబాద్లోని చందానగర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. యువతులు, మహిళలు స్వయంశక్తితో, ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంబనే అసలైన గౌరవం ఇస్తుందన్నారు.
ఎవరి మీద ఆధారపడకుండా, ఉద్యోగం, వ్యాపారం చేసే స్థాయికి ఎదగాలని, అప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో మహిళా సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆడబిడ్డల ఆశీస్సులతో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన సోషల్ వర్కర్స్, ఆర్టిస్టులు, జర్నలిస్టులు, శానిటేషన్ వర్కర్లు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ పురస్కారాలను అందజేశారు. అనంతరం చందానగర్లో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
నేడు తెలంగాణ భవన్లో మహిళాదినోత్సవం
హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.