హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ తాత్సారంతో తెలంగాణలో ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తమైంది. ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ ఇంజినీర్ల స్థానాలను ప్రభుత్వం భర్తీ చేయకుండా సీఈలకు, లేదంటే ఎస్ఈలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నది. పూర్తిస్థాయి అధికారులను నియమించకుండా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నది. దీంతో నీటి పారుదల శాఖలో పరిపాలన పూర్తిగా గాడితప్పి, ఈ ఏడాది కనీసం సాగునీటి సరఫరాను కూడా పర్యవేక్షించలేని దుస్థితి నెలకొన్నది.
నచ్చినోళ్లకు.. పైరవీలు చేసినోళ్లకే పోస్టులు
రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో మొత్తం 19 సర్కిల్స్ ఉన్నాయి. వాటిలోని అన్ని విభాగాల్లో కలిపి 23 సీఈ పోస్టులు ఉన్నాయి. నిరుడు ఆగస్టులోనే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. కానీ, ప్రస్తుతం కొత్తగా ప్రమోషన్ పొందినవారితోపాటు ఇప్పటికే 13 మంది సీఈలు ఉద్యోగ విరమణ పొందారు. వారిలో భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, గజ్వేల్, కరీంనగర్, ఆదిలాబాద్, రామగుండం, జగిత్యాల, హైడ్రాలజీ సీఈలు ఉన్నారు. మార్చి నెలాఖరున మరో ఇద్దరు ఈఎన్సీలు సైతం ఉద్యోగ విరమణ పొందనుండటంతో అనేక చోట్ల ఎస్ఈలు, పలు సర్కిళ్లలో ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి.
ప్రమోషన్లతో ఆ పోస్టులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నది. డిపార్ట్మెంట్ ప్రమోషనల్ కమిటీ (డీపీసీ) ఏర్పాటు చేయకుండా, అర్హులైన ఇంజినీర్లకు ప్రమోషన్లు కల్పించకుండా చోద్యం చూస్తున్నది. ఇన్చార్జులు, ఇతరులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ నెట్టుకొస్తున్నది. ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఈఈ పోస్టులు ఖాళీ అయినప్పుడు సీనియార్టీ జాబితాలో ఉన్న ఇంజినీరుకు, సీనియర్ ఇంజినీర్ లేకుంటే ఆ బాధ్యతలను పక్కనే ఉన్న ఇతర సీఈ, ఎస్ఈ, ఈఈలకు అప్పగించడం ఆనవాయితీ. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఆ నిబంధనలనూ తుంగలో తొక్కింది. నచ్చినోళ్లకు, పైరవీలు చేసి నోళ్లకే బాధ్యతలు అప్పగిస్తున్నది. సీనియర్ల ఉద్యోగ విరమణకు ఒకరోజు, లేదంటే గంటల ముందుగా ప్రమోషన్లను కల్పించే సంప్రదాయానికి తెరతీసింది.
గాడితప్పిన పాలన
ఖాళీ అయిన పోస్టులను ప్రభుత్వం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయకుండా ఇష్టానుసారం ఎక్కడికక్కడ ఇన్చార్జులను నియమిస్తుండడంతో ఇరిగేషన్ శాఖల పాలన మొత్తం గాడితప్పుతున్నదని సీనియర్ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకస్థానాల్లో ఉన్న ఇంజినీర్లు అదనపు బాధ్యతల వల్ల సమావేశాలకు, ప్రధాన కార్యాలయాలకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకొన్నదని, దీంతో క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించేవారే లేకుండా పోయారని వివరిస్తున్నారు. ప్రస్తుతం కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తున్నప్పటికీ ఎక్కడ ఏమేరకు, ఎప్పుడు, ఎవరు విడుదల చేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొన్నది. ఇంజినీర్ల మధ్య ఆహ్లాదకర వాతావరణం లేకపోవడంతోపాటు గ్రూపులుగా విడిపోయారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అనాలోచిత, అడ్డదిడ్డమైన చర్యలతో సీనియర్ వర్సెస్ జూనియర్ అన్నచందంగా పరిస్థితి తయారైంది. ఉన్నత స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారికి దిగువనున్న సీనియర్ ఇంజినీర్లు సహకరించకుండా పరోక్షంగా సహాయ నిరాకరణ పాటిస్తున్నారని పలువురు బాహాటంగానే చెప్తున్నారు. మరోవైపు అదనపు బాధ్యతల వల్ల తీవ్ర పనిభారంతో సతమతమవుతున్నామని, దీంతో ఏ పనిపైనా సరిగా దృష్టి సారించలేకపోతున్నామని ఇరిగేషన్ ఉన్నతాధికారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కమిటీల పేరిట కాలయాపన చేయకుండా వెంటనే ప్రమోషన్లు కల్పించాలని, ఖాళీ అయిన పోస్టుల్లో పూర్తిస్థాయి అధికారులను నియమించాలని ఇంజినీర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈఎన్సీ జనరల్‌కు ఎక్స్టెన్షన్!
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈఎన్సీ జనరల్‌గా కొనసాగుతున్న ఓలేటి వెంకట రమేశ్‌బాబు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయననే మరో ఏడాదిపాటు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు జలసౌధవర్గాలు వెల్లడిస్తున్నాయి. రమేశ్‌బాబుకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనలపై ఇంజినీర్ అసోసియేషన్లు, జలసౌధవర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు కృష్ణా ట్రిబ్యునల్‌లో చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు ఏపీ దూకుడుగా ముందుకుపోతున్నది. కేంద్ర జలశక్తిశాఖ చర్చలకు ఆహ్వానిస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలకు కీలకమైన సందర్భంలో ఇప్పటికే ఏపీకి చెందిన అధికారికి కీలక బాధ్యతలను ప్రభుత్వం అప్పగించడంపై ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అమాత్యుడి వెనుక కుట్ర
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని ఇంజినీర్లు చెప్తున్నారు. సీఎంవోలో, ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి కొందరు ఇంజినీర్లు ప్రణాళిక ప్రకారమే సీనియర్ ఇంజినీర్లను పక్కకు నెడుతున్నారని, అమాత్యుడి ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదని జలసౌధ వర్గాలు ధ్వ జమెత్తుతున్నాయి. తొలుత కాంగ్రెస్ ప్రభు త్వం కాళేశ్వరం ప్రాజెక్టు, విజిలెన్స్, ఘోష్ కమిషన్ల పేరిట హడావుడి చేసి, రాజకీయంగా వినియోగించుకోవడాన్ని అదునుగా చేసుకుని, ఆ నివేదికలు సాకుగా సీనియర్ తెలంగాణ ఇంజినీర్లను తప్పించారని నిప్పులు చెరుగుతున్నారు. వారిపై చర్యలు చేపట్టకుండా, ప్రమోషన్లు కల్పించకుం డా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. రెగ్యులర్ ప్రమోషన్లను కల్పిస్తే తమ స్థానాలకే ఎసరు వస్తుందనే కుట్రతోనే డీపీసీ కొనసాగకుండా చూస్తున్నారని వివరిస్తున్నారు. అమాత్యుడికి సైతం వాస్తవాలు తెలియకుండా మభ్యపెడుతున్నారని ఇంజినీర్లతోపాటు అసోసియేషన్లు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఒకరిద్దరు అధికారులే పెత్తనం చెలాయిస్తున్నారని ఇంజినీర్లు చెప్తున్నారు.
అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొందరు ఇంజినీర్లు
