కుభీర్/గన్నేరువరం, మార్చి 7 : కరెంట్ కోతలను నిరసిస్తూ నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్ ఎదుట శనివారం కుభీర్, ధార్కుభీర్, రాజురా గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయం, అప్రకటిత కోతలపై మండిపడ్డారు. విద్యుత్తు సమస్యపై సబ్ స్టేషన్‌కు ఫోన్ చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదని వాపోయారు. పొంతనలేని సమాధానాలు చెప్తూ తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న కుభీర్ సర్పంచ్ కందూరి సాయినాథ్, ఏఎస్సై శ్రీనివాస్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. సర్పంచ్ సాయినాథ్ ఏఈ ఆదిత్యతో ఫోన్లో మాట్లాడి సమస్యను విన్నవించగా ఆదివారం నుంచి వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
రెండు రోజులుగా కరెంటు ఉంటలేదు..
రెండు రోజులుగా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాల రైతులు, ప్రజలు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్‌వర్మ, చీమలకుంటపల్లి సర్పంచ్ జంగిడి ప్రకాశ్ మాట్లాడుతూ.. తమ గ్రామాల్లో రెండు రోజులుగా కరెంటు ఉండటం లేదని, దీంతో కనీసం తాగడానికి నీళ్లు ఉండటం లేదని, పంట పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే సమస్యను పరిషరించి 24 గంటల త్రీఫేజ్ కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సబ్‌స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.