భువనగిరి అర్బన్, జూలై 31 : రూ.10 వేల కోట్లు విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 9, ఆర్ఆర్ యాక్ట్ ను రద్దు చేయాలని, విద్యార్థుల స్కాలర్షిప్ మీద, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల రాందేవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరిలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులతో ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించి విద్యార్థి నాయకులు బస్సుల పైకెక్కి నినాదాలు, ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు రావలసిన రూ.10 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో నెంబర్ 9ను ఆర్ఆర్ యాక్ట్ రద్దు చేసి పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని, పాత పద్ధతిలోనే విద్యార్థులకు బకాయిలు చెల్లించాలని, విద్యాశాఖ మంత్రిని నియమించి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీకి లక్షల కోట్లు ఉంటాయి గానీ విద్యార్థులకు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని, కాలేజీ యజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను వేధిస్తున్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని, సంక్షేమ హాస్టల్స్లకు సొంత భవనాలు నిర్మించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలన్నారు. మెస్ చార్జీలు పెంచాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇవ్వాలన్నారు. వంద రోజుల్లోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చాక విద్యార్థుల చావులపై పేలాలు ఏరుకుంటుందనీ ధ్వజమెత్తారు. ప్రభుత్వం వంద రోజుల్లో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు తప్ప రాష్ట్రంలో ఎలాంటి మార్పు లేదన్నారు. హాస్టలకు సొంత భవనాలులేవు, ఉన్న అద్దె కొంపలకు బెచ్చులూడి విద్యార్థులు చనిపోయే ప్రమాదం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
ఆర్ కృష్ణన్న కొట్లాడి విద్యార్థుల కోసం పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించే విధంగా పెట్టిస్తే ఆ జీవోను తుంగలోకి తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం ట్రస్ట్ బ్యాంక్ పెడతామని బెదిరిస్తుందన్నారు. ఇలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదనీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలనీ, పెంచిన ఫీజులన్నీ ప్రభుత్వమే భరించాలనీ, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలనీ, విద్యారంగానికి నిధులు కేటాయించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఎంపి ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, బస్సులు దానాలు చేసి ప్రభుత్వని అట్టుడికిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు పల్లపు దుర్గయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సాయిలు, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల అనిల్, నాయకులు చిల్లర యశ్వంత్, జినుకల జస్వంత్, అరుణ్, ప్రవీణ్, శివ, రామ్ చరణ్ నాయక్, లింగస్వామి, శ్రీకాంత్, హరీష్, దామోదర్, ప్రశాంత్, లోకేష్, మానస, సంతోష, శైలజ, విగ్నేశ్వరి, మౌనిక, సాత్విక పాల్గొన్నారు.

‘విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి’