చండ్రుగొండ, జూలై 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం (కెసిఆర్ కాలనీ) లో అంతర్గత రోడ్లు బురదమయంగా మారినా పట్టించుకోవడం లేదని అధికారుల వైఖరిని నిరసిస్తూ శుక్రవారం కాలనీవాసులు బురదలో నిలబడి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ… గత ఏడాదిగా కాలనీలో బురద రోడ్లు ఉన్నాయని, తాగునీటి సమస్య సైతం ఉన్నదని పలుమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. తాము వారికి ఓట్లు వేయలేదని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని, తాము ఏ పార్టీకి ఓట్లు వేశామో వాళ్లెలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. అధికారులు సైతం అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్నారని, తమ సమస్యలు పట్టించుకోకపోతే, అంతర్గత రోడ్లకు మరమ్మతులు చేయకపోతే పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.