Nani | నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. కొత్త దర్శకులతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నాని, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఓజీ’ ఫేమ్ దర్శకుడు సుజీత్‌తో నాని కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.నాని–సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినిమాలో నానికి జోడీగా టాలీవుడ్లో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరిని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమెకు ‘హిట్ 2’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా కీలక అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్లో తన స్థాయిని పెంచుకున్నారు.‘గుంటూరు కారం’, ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో మీనాక్షి చౌదరి మంచి విజయాలను అందుకున్నారు. దీంతో ఆమెకు టాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్యతో ‘వృషకర్మ’లో నటిస్తున్న ఈ భామకు ఇప్పుడు నాని సరసన నటించే అవకాశం దక్కితే అది ఆమె కెరీర్లో మరో కీలక అడుగుగా మారే అవకాశం ఉంది.
ఇక నాని–సుజీత్ సినిమా కథాంశం కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. యూకేలోని ఫుడ్ మాఫియా నేపథ్యంలో డార్క్ హ్యూమర్, యాక్షన్ అంశాలను కలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ ప్రపంచానికి సంబంధించిన కథలో నాని ఇప్పటివరకు కనిపించని సరికొత్త పాత్రలో కనిపించనున్నారని టాక్. నాని పాత్రలో చెఫ్‌కు సంబంధించిన షేడ్స్‌తో పాటు గ్యాంగ్‌స్టర్ తరహా లక్షణాలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఒకే పాత్రలో విభిన్న కోణాలను చూపించే విధంగా సుజీత్ కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. నాని, సుజీత్, పృథ్వీరాజ్ కాంబినేషన్‌కు తోడు మీనాక్షి చౌదరి కూడా భాగమైతే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 2027 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.