గ్రామ స్వరాజ్యానికి గ్రహణం
తెలంగాణ గ్రామ స్వరాజ్యానికి గ్రహణం పట్టింది. గ్రామీణాభివృద్ధి.. స్థానిక సంస్థలకు అధికారాలు అంటూ గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ మాటలకు, క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆర్థిక స్థితిగతులకు పొంతనే లేకుండా పోయింది. రాష్ట్రంలో ఒకో గ్రామ పంచాయతీ సగటు వ్యయం రూ.16.59 లక్షల నుంచి రూ.6.24 లక్షలకు పడిపోయింది. ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ఆందోళనకరమైన గణాంకాలను బయటపెట్టింది.
- పల్లెల ప్రగతికి కాంగ్రెస్ సరార్ సమాధి
- ఆర్థికంగా కుదేలైన తెలంగాణ పంచాయతీలు
- మూడేండ్లలో సగటు వ్యయం 62.4% పతనం
- రూ.16.59 లక్షల నుంచి రూ.6.24 లక్షలకు.. ఆదాయంలోనూ కూడా 73.5 శాతం క్షీణత
- మిగులు బడ్జెట్ నుంచి లోటులోకి మన ఊరు
- గ్రాంట్లపైనే ఆధారపడుతున్న గ్రామీణ పాలన
- ఆంధ్రప్రదేశ్, త్రిపురలో పెరుగుతున్న వ్యయం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తిరోగమనం
- ఆర్బీఐ నివేదికలో జీపీల దుస్థితి బట్టబయలు
తెలంగాణ గ్రామ స్వరాజ్యానికి గ్రహణం పట్టింది. గ్రామీణాభివృద్ధి.. స్థానిక సంస్థలకు అధికారాలు అంటూ గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ మాటలకు, క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆర్థిక స్థితిగతులకు పొంతనే లేకుండా పోయింది. రాష్ట్రంలో ఒకో గ్రామ పంచాయతీ సగటు వ్యయం రూ.16.59 లక్షల నుంచి రూ.6.24 లక్షలకు పడిపోయింది. ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ఆందోళనకరమైన గణాంకాలను బయటపెట్టింది.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పొద్దున లేస్తే గ్రామ స్వరాజ్యం.. గ్రామీణ అభివృద్ధి.. స్థానిక సంస్థలకు అధికారాలు అంటూ గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ పాలకుల మాటలకు, క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితిగతులకు పొంతనే లేకుండా పోయింది. గ్రామాల అభివృద్ధికి కీలకమైన పంచాయతీరాజ్ వ్యవస్థ రేవంత్‌రెడ్డి పాలనలో ఆర్థికంగా బలహీనపడుతున్నది. అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులు, ఆదాయ వనరులూ క్రమంగా క్షీణిస్తున్నాయి. ఫలితంగా గ్రామ పంచాయతీలు మిగులు బడ్జెట్ స్థితి నుంచి లోటు బడ్జెట్లోకి జారుకున్నాయి. గతంలో అభివృద్ధి పనులకు గణనీయంగా ఖర్చు చేసిన పంచాయతీలు ఇప్పుడు కనీస అవసరాలకు కూడా నిధుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయత్‌రాజ్ ఇన్స్టిట్యూషన్స్-లోకల్ ఫైనాన్సెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ రూరల్ ఇండియా’ నివేదిక తెలంగాణ గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిపై ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడించింది. 2022-23 నుంచి 2024-25 వరకు మూడేండ్ల ఆర్థిక గణాంకాలను విశ్లేషించిన ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో ఒకో గ్రామ పంచాయతీ సగటు వ్యయం రూ.16.59 లక్షల నుంచి రూ.6.24 లక్షలకు పడిపోయింది.
అంటే ఏకంగా 62.4% తగ్గింది. ఇదే సమయంలో సగటు ఆదాయం రూ.16.72 లక్షల నుంచి రూ.4.42 లక్షలకు దిగజారింది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని 2,25,458 గ్రామ పంచాయతీల ఆర్థిక గణాంకాలను ఈ నివేదిక విశ్లేషించింది. తెలంగాణలోని మొత్తం 12,994 గ్రామ పంచాయతీల్లో 11,025 పంచాయతీల సమాచారాన్ని పరిశీలనలోకి తీసుకున్నది. అంటే రాష్ట్రంలోని 84.8% పంచాయతీల గణాంకాలు ఈ అధ్యయనంలో భాగమయ్యాయి. పంచాయతీలు సమర్పించిన వార్షిక ఆర్థిక నివేదికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం ఆధారంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విశ్లేషణ చేపట్టింది.

మిగులు బడ్జెట్ నుంచి లోటు వైపు!
తెలంగాణ పంచాయతీల ఆర్థిక స్థితిలో మరో కీలక పరిణామాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీసీ) వెల్లడించింది. 2022-23లో మిగులు బడ్జెట్ నమోదు చేసిన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు 2023-24 నాటికి లోటు బడ్జెట్లోకి మారాయి. అసోం, పంజాబ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ ఇదే తరహా మార్పు నమోదైంది. అయితే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, మిజోరం రాష్ట్రాల్లో మాత్రం 2022-23లో లోటులో ఉన్న పంచాయతీలు 2023-24 నాటికి మిగులు స్థితికి చేరుకున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర పంచాయతీలు రెండు సంవత్సరాల్లోనూ మిగులు నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా 2022-23 నుంచి 2024-25 వరకు మూడేండ్ల సగటు ద్రవ్యలోటు మొత్తం రాబడుల్లో 1.7 శాతంగా నమోదైంది. అయితే 2024-25 తాతాలిక గణాంకాలను మినహాయిస్తే, 2022-23, 2023-24లో కలిపి జాతీయ స్థాయిలో 5.4 శాతం మిగులు నమోదైంది. జాతీయ స్థాయిలో మెరుగైన ఆర్థిక పరిస్థితి కనిపిస్తుంటే తెలంగాణ మాత్రం లోటులోకి వెళ్లడం గమనార్హం.
ఎన్నికల జాప్యంపై విమర్శలు
గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికైన పాలకవర్గాలకు అధికారాలు కల్పించడం, నిధుల విడుదలలో పారదర్శకత పాటించడం స్థానిక స్వపరిపాలనకు అత్యంత కీలకం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యంపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం కూడా నిధుల ప్రవాహానికి అడ్డంకిగా మారింది. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణకు పంచాయతీలే కీలకమైన సంస్థలు. వాటికి నిధులు లేకపోతే గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. కావున పంచాయతీలకు నిధుల కేటాయింపుతోపాటు సకాలంలో విడుదల, స్థానికంగా ఆదాయం సమకూర్చుకునే అవకాశాలు కల్పించడం అత్యవసరం.
16వ ఆర్థిక సంఘం నుంచి నిధులు
పంచాయతీల ఆర్థిక స్వావలంబన కోసం సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఆస్తిపన్ను వసూళ్లను మెరుగుపరచడం, ఆస్తుల రిజిస్టర్లను ఆధునికీకరించడం, స్థానిక పన్నులు, వినియోగ రుసుముల వసూళ్లను పటిష్టం చేయడం, డిజిటల్ విధానాలను అమలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నది. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ల విడుదలలోనూ స్థిరత్వం, ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపింది. ఆర్థిక నిర్వహణ, నిధుల వినియోగం, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. ఇదిలావుండగా 2026-31 కాలానికి గ్రామీణ స్థానిక సంస్థలకు 16వ ఆర్థిక సంఘం రూ.4.35 లక్షల కోట్ల గ్రాంట్లను సిఫారసు చేసింది. ఇది 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మొత్తంతో పోలిస్తే ఏకంగా 83.8% అధికం. ఈ నిధుల్లో 80% బేసిక్ గ్రాంట్లు, 20% పనితీరు ఆధారిత గ్రాంట్లుగా ప్రతిపాదించారు. పనితీరు ఆధారిత గ్రాంట్లలో కొంత భాగాన్ని పంచాయతీల సొంత ఆదాయ సమీకరణలో మెరుగుదలతో అనుసంధానించారు.
పాలకుల బాధ్యత ఏమిటి?
గ్రామ పంచాయతీలకు నిధులు తగ్గిపోతే దాని ప్రభావం నేరుగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలపై పడుతుంది. తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్వహణ తదితర కార్యకలాపాలన్నీ నిధులపైనే ఆధారపడి ఉంటాయి. పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం, సకాలంలో ఎన్నికలు నిర్వహించ డం, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అధికారా లు కల్పించడం, కేంద్ర గ్రాంట్లను సకాలంలో వినియోగించుకోవడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా ఉండాలి.
పంచాయతీల సగటు వ్యయం మూడేండ్ల్లలో 62 శాతానికిపైగా పడిపోవడం చిన్న విషయం కాదు. ఇది గ్రామీణ వ్యవస్థ ఎదురొంటున్న ఆర్థిక సంక్షోభానికి స్పష్టమైన సంకేతం. గ్రామాలకు నిధులు, పంచాయతీలకు అధికారాలు, స్థానిక సంస్థలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాకారమవుతుంది. మూ డేండ్లలో తెలంగాణ గ్రామ పంచాయతీల సగటు ఆదాయం, వ్యయం ఇంతగా పడిపోవడానికి కారణాలేమిటి? కేంద్ర, రాష్ట్ర గ్రాంట్ల వినియోగంలో ఎకడ లోపం జరిగింది? పంచాయతీలను తిరిగి మిగులు బడ్జెట్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టే చర్యలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఉన్నది.
గ్రాంట్లే ఆధారం.. సొంత ఆదాయం అంతంతే!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, స్థానికంగా సమకూర్చుకునే సొంత ఆదాయమే గ్రామ పంచాయతీలకు ప్రధాన ఆర్థిక వనరులు. తెలంగాణ పంచాయతీలకు ఈ రెండు మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలోనూ తగ్గుదల నమోదైంది. మూడేండ్లలో సొంత ఆదాయం రూ.2.36 లక్షల నుంచి రూ.1.62 లక్షలకు తగ్గింది. గ్రాంట్లు రూ.14.34 లక్షల నుంచి రూ.2.81 లక్షలకు పడిపోయాయి. ముఖ్యంగా 2024-25లో తీవ్ర తగ్గుదల నమోదైంది. కానీ, ఆ ఏడాది గణాంకాలు తాతాలికమైనవని ఆర్బీఐ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కూడా పంచాయతీలు ప్రభుత్వ గ్రాంట్లపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. జాతీయ స్థాయిలో మొత్తం ఆదాయంలో దాదాపు 90% గ్రాంట్ల రూపంలోనే వస్తుండగా, సొంత ఆదాయం వాటా సుమారు 10 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో పన్ను వసూళ్లు, ఆస్తిపన్ను, వినియోగ రుసుములు, ఇతర స్థానిక ఆదాయ మార్గాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఏపీలో పెరుగుదల.. తెలంగాణలో పతనం

పంచాయతీల సగటు వ్యయాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ వెనుకబాటుతనం మరింత స్పష్టమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో 2022-23లో ఒకో పంచాయతీ సగటు వ్యయం రూ.8.52 లక్షలుండగా.. 2024-25 నాటికి రూ.16.42 లక్షలకు పెరిగింది. త్రిపురలోనూ రూ.12.10 లక్షల నుంచి రూ.20.20 లక్షలకు చేరింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్, త్రిపురలో పంచాయతీల వ్యయం పెరుగుతుంటే, తెలంగాణలో మాత్రం మూడేండ్ల్లలోనే 62 శాతానికిపైగా తగ్గింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసే సామర్థ్యం ఎందుకు తగ్గిందన్న ప్రశ్నకు కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాల్సి ఉన్నది.
ఆదాయ, వ్యయాల్లో భారీ పతనం

తెలంగాణ గ్రామ పంచాయతీల ఆదాయం, వ్యయం రెండింటిలోనూ క్షీణత కనిపిస్తున్నది. 2022-23లో ఒకో పంచాయతీకి సగటున రూ.16.72 లక్షల ఆదాయం రాగా.. 2023-24లో రూ.14.38 లక్షలకు, 2024-25 నాటికి ఏకంగా రూ.4.42 లక్షలకు పడిపోయింది. రెండేండ్ల వ్యవధిలో ఆదాయంలో 73.5 శాతం క్షీణత నమోదైంది. ఆదాయానికి మించి వ్యయం పెరుగడంతో పంచాయతీల ఆర్థిక సమతుల్యత దెబ్బతిన్నది. 2022-23లో వ్యయం కంటే ఆదాయం స్వల్పంగా ఎకువగా ఉన్నది. ఆ తర్వాతి రెండేండ్లలో వ్యయం ఆదాయాన్ని మించిపోయింది. ముఖ్యంగా 2024-25లో ఆదాయం, వ్యయం మధ్య అంతరం మరింత పెరిగింది.
అభివృద్ధి పనులకు నిధులెకడ?

దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు చేస్తున్న వ్యయంలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం లభిస్తున్నది. 2022-23 నుంచి 2024-25 మధ్య కాలంలో నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై వ్యయం వాటా 39.1 శాతం నుంచి 44.5 శాతానికి పెరిగింది. అదే సమయంలో పంచాయతీరాజ్ కార్యక్రమాల వ్యయం వాటా 40.3 నుంచి 25.7 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా మొత్తం పంచాయతీల వ్యయం పెరుగుతున్నప్పటికీ వాటి మధ్య రాష్ట్రాలవారీగా, పంచాయతీల పరిమాణాన్ని బట్టి గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. పెద్ద గ్రామ పంచాయతీలు మొత్తం ఆదాయం, వ్యయంలో సుమారు 52% వాటా కలిగి ఉన్నాయి. చిన్న, మధ్యస్థాయి పంచాయతీలకు ఆర్థిక వనరులు, పరిపాలనా సామర్థ్యం పరిమితంగా ఉండటం అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

