హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఖజానాకు వెన్నెముకలా నిలిచి ఏటా రూ.75 వేల కోట్ల ఆదాయాన్ని అందిం చే వాణిజ్య పన్నులశాఖను ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తున్నది. మున్సిపల్ పరిపాలన నమూనాను రెవెన్యూ ఆధారితశాఖకు రుద్దడంతో పర్యవేక్షణ లోపించి రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడే ప్రమాదం పొంచి ఉన్నది. రాష్ట్రప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్- 2047’ విజన్ డాక్యుమెంట్లో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ రీజియన్లుగా విభజించింది. దీనిప్రకారం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విడగొట్టినట్టే అన్ని శాఖలను అదే నమూనాలో పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ విభజన జనాభా, భౌగోళిక విస్తీర్ణంపై ఆధారపడి ఉంటుంది. కానీ, వాణిజ్య పన్నులశాఖ పూర్తి గా ట్యాక్స్‌పేయర్ల సంఖ్య, వ్యాపార లావాదేవీల పరిమాణంపై ఆధారపడి ఉండాలి. కేవ లం జీహెచ్ఎంసీ సరిళ్ల లెకన పన్నుల శాఖను విభజిస్తే, పన్ను ఎగవేతదారులకు అడ్డూఅదుపు లేకుం డాపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్లో రాష్ర్టాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ఓఆర్ఆర్ లోపల పరిధి, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్) ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలోని పరిధి, రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ(రేర్) ట్రిపుల్ ఆర్ బయటి పరిధిగా రాష్ట్ర ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించారు. క్యూర్, ప్యూర్, రేర్ నమూనాలోనే అన్ని శాఖలను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. వాణిజ్య పన్నులశాఖలోనూ ఇదే విధమైన మార్పులు తేవాలని ప్రభుత్వం ఈ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. జీహెచ్ఎంసీలో 60 సర్కిళ్లు, 13 జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. ఇదే తరహాలో అన్ని శాఖ ల కార్యాలయాలు ఉండాలని సీఎం ఆదేశిస్తున్నారు. మున్సిపల్ పరిపాలన నమూనా విభజన.. వాణిజ్య పన్నులశాఖకు సరికాదని, ఇది పూర్తిగా భిన్నమైనదని, అశాస్త్రీయమని, రాష్ట్ర ఖజానాకు వెన్నుదన్నుగా నిలిచే ఈ శాఖపై ప్రతికూల ప్రభావం పడనున్నది.
సీజీఎస్టీ రేంజ్‌లు 152..వాణిజ్య శాఖ సర్కిళ్లు 118
రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్(సీజీఎస్టీ) వసూళ్లు, పర్యవేక్షణ కో సం 152 రేంజ్ కార్యాలయా లు ఉన్నాయి. కానీ, జీఎస్టీ చెల్లింపులను పర్యవేక్షించే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వాణి జ్య పన్నులశాఖ సర్కిళ్లు 118 మాత్రమే ఉన్నాయి. వీటి ఏర్పాటు కూడా సక్రమంగా జరుగలేదు. హైదర్‌నగర్ సర్కిల్లో 11వేల మంది పన్ను చెల్లింపుదారులు ఉంటే, ఒక సర్కిల్లో 5వేల మంది, మరికొన్ని సర్కిళ్లలో 6వేల మంది ట్యాక్స్‌పేయర్లు ఉన్నారు. కేంద్ర ప్రత్య క్ష, పరోక్ష పన్నుల పర్యవేక్షణ బోర్డు(సీబీఐసీ) మార్గదర్శకాల ప్రకారం.. 1,500మంది ట్యాక్స్‌పేయర్ల పర్యవేక్షణకు ఒక రేంజ్ ఆఫీస్ ఉండాలి. పన్ను చెల్లింపులుదారులు పన్ను ఎగవేయకుండా పర్యవేక్షణ సక్రమంగా ఉంటే నే ఖజానాకు ఆదాయం సమకూరుతుంది. లేదంటే జీఎస్టీ చెల్లించకుండా ఖజానాకు గండికొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే సీజీఎస్టీ తరహాలో కనీసం 135 రేంజ్‌లు ఏర్పాటుచేయాలని, 2 వేల మంది ట్యాక్స్‌పేయర్లకు ఒక సర్కిల్ ఏర్పాటుచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల వాణిజ్య పన్నులశాఖ రాష్ట్ర ఫోరం ప్రభుత్వాన్ని కోరుతున్నది.
ఆర్థికాంశాల ఆధారంగానే పునర్వ్యవస్థీకరించాలి
మున్సిపల్ పరిపాలన ప్రాతిపదికన కాకుండా.. పన్ను చెల్లింపుదారుల సంఖ్య, వ్యాపార లావాదేవీల పరిమాణం, ఆదాయ సామర్థ్యం ఆధారంగానే శాఖలోని డివిజన్లు, సరిళ్ల పునర్వ్యవస్థీకరణ జరగాలి. వాణిజ్య పన్నులశాఖ కేవలం పరిపాలనా విభాగం మాత్రమే కాదు. ఇది పూర్తిగా ఆదా యం, రెగ్యులేటరీ అంశాలతో ముడిపడి ఉన్నందున భౌగోళిక సరిహద్దుల కంటే ఆర్థిక అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాలను అందుకోవాలంటే వాణిజ్య పన్నులశాఖను ఆర్థిక, రాబడి అంశాల ఆధారంగానే పునర్వ్యవస్థీకరించాలి.
– డీ కిషన్‌ప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల వాణిజ్య పన్నులశాఖ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడుడెక్కన్ సిమెంట్స్