KTR | రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొచ్చేందుకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానీ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేందుకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్లు పెట్టి, పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తేసే కుట్ర చేస్తున్నదని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లను తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు నిన్న క్యాబినెట్లో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ (Prepaid) మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో, వ్యవసాయానికి ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయన్నారు. మోటార్లకు మీటర్లు రాకముందే, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగంలో చేస్తున్న కరెంటు కుట్రల పైన తిరగబడాలని కోరారు.
కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్ పోతుందని ఎన్నికల ముందే బీఆర్ఎస్ ప్రజలను హెచ్చరించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. మోటర్ల దగ్గర మీటర్లు వస్తాయని, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్తారని కేసీఆర్ హెచ్చరించారని కేటీఆర్ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణం అన్నారు.
ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని గతంలో ప్రధానమంత్రి మోదీ ఎంత ఒత్తిడి చేసినా, రూ. 30 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా కేసీఆర్ ఎదిరించారు కానీ మీటర్లు పెట్టలేదు. కానీ, రానున్న మూడు నెలల్లోనే మొత్తం మీటర్లు పెడతామని చెప్పి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కేటీఆర్ అన్నారు. రానున్న మూడు నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి, ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురాబోతున్నదని కేటీఆర్ అన్నారు.అయితే కాంగ్రెస్ ఉచిత కరెంట్‌ను ఎత్తేయడం కోసమే ప్రీపెయిడ్ మీటర్లను తీసుకువస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కేవలం ఉచిత కరెంట్‌ను రద్దు చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే, అదానీ, అంబానీలకు విద్యుత్ సంస్థలను అప్పగించాలన్న లక్ష్యంతోనే క్యాబినెట్ నిన్న ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు.
కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బలమైన గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చెప్తారన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడుగడుగునా అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్‌కి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతి పైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు.