సారంగాపూర్, జూలై 30 : భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఆయన సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో పర్యటించి, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెంబట్లకు చెందిన పస్తం స్వప్న, ఆమె సోదరులు పరమేశ్, దుర్గేశ్ ఇల్లు కూలిపోగా, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మధుసూధన్, తహసీల్దార్ వహిదొద్దీన్తో ఫోన్లో మాట్లాడారు. వర్షాలకు ఇల్లు పూర్తిగా కూలిపోతే ఎంత నష్టపరిహారం వస్తుందని అడిగారు.
జీవో ప్రకారం బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించడంతోపాటు నూతన ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహయం అందేలా.. నూతన ఇల్లు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఇల్లు నిర్మాణం మొదలు పెడితే తనవంతు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి కొంత నగదు అందించారు. ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేశ్, బీఆర్ఎస్ మండల అద్యక్షుడు తేలు రాజు, నాయకులు వాసం శ్రీనివాస్, అలీమ్, జనార్ధన్, వెంకటేశ్, వేణు, మల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.