KTR | ఉన్న నగరాన్ని పట్టించుకునే శక్తి లేదు కానీ.. ఫ్యూచర్ సిటీ (Future City) అంటూ అడ్డగోలు మాటలు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి పోజులు కొడుతున్నారని అన్నారు. హైదరాబాద్లో కనీసం మోరి తీసి, చెత్త ఎత్తే పరిస్థితిలో కూడా లేని మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే ఎవరూ నమ్మరని తెలిపారు. ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే పట్టించుకునేది ఎవరు అని ప్రశ్నించారు.
హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మీటింగ్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మూసీని ప్రక్షాళన చేస్తా అంటున్న ముఖ్యమంత్రి ఆలోచనపై, ప్రణాళికలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోనే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి, దాదాపుగా పూర్తయిన మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆల్రెడీ ముగిసిపోయిన మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్ట్ కమీషన్ల కోసమే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఎలాంటి విధ్వంసం లేకుండా, ఎలాంటి ఇండ్ల తొలగింపు లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం వేలాది మంది ఇండ్లు కూలగొట్టి, మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షలాది మంది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం మూసీపై ఎస్టీపీల (STP) నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం వంటి పనులు ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు మళ్లీ లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఎందుకు అని ప్రశ్నించారు.
త్వరలోనే సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని.. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై, అన్యాయాలపై, ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరుపై కూడా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈసారి సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని చెప్పారు. ముందుగా సభ్యత్వ నమోదు, తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగర పరిధిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వంపైన పోరాటం చేసిన వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కేవలం గెలుపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు అవకాశం ఇస్తుందని అన్నారు.
ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాల కాలంలో చేసిన అన్యాయాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రెండున్నర సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టని రేవంత్ రెడ్డి, అడ్డగోలుగా ‘హైడ్రా’ పేరుతో వేల ఇండ్లు కూలగొట్టారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ మాత్రం వేల ఇండ్లు కూలగొట్టిందన్నారు.