ఒకవైపు అత్యధిక విద్యుత్తు డిమాండ్‌ను చేరుకున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండగా, మరోవైపు కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయి. వేళాపాలా లేని విద్యుత్తు సరఫరాకు తోడు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం,13 గంటలకు మించి కరెంటు ఇవ్వకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. కరెంటు సమస్యతో పంటలు ఎండుతుండటంతో పలుచోట్ల రైతులు సబ్స్టేషన్లను ముట్టడించారు. నిర్మల్ జిల్లా కుభీర్, కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపూర్ సబ్స్టేషన్ల వద్ద శనివారం ఆందోళనకు దిగారు.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తేతెలంగాణ): ‘అయ్యా కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదు.. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంట్ కోసం కావలికాసే ఉమ్మడి రాష్ట్రంనాటి రోజులు మళ్లీ వచ్చాయి’ అని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) బహిరంగ విచారణలో రైతులు, రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు. రోజుకు 13 గంటలు మాత్రమే ఇస్తున్నారని, కొన్నిచోట్ల మాత్రం 14, 16 గంటలే ఇస్తున్నారని మండిపడ్డారు. ‘రంగారెడ్డి జిల్లాలో కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియడమే లేదు, మీరైనా చెప్పండి’ అంటూ వేడుకున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) టారిఫ్ ప్రతిపాదనలపై ఈఆర్సీ శనివారం బహిరంగ విచారణ జరిపింది. ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ్ భవన్లో నిర్వహించిన ఈ బహిరంగ విచారణలో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున, సభ్యులు శ్రీనివాసరావు, రఘు హాజరై రైతులు, రైతు ప్రతినిధులు వాదనలు విన్నారు. తొలుత టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ సంస్థ ఆర్థిక స్థితిగతుల నివేదికను సమర్పించారు. ఆ తర్వాత వివిధ సంఘాలు, సంస్థల ప్రతినిధులు, రైతులు తమ వాదనలు వినిపించారు.
ఉమ్మడి నల్లగొండలో ఇన్ని మరణాలా?
రైతుల మరణాలంటే లెక్కేలేదా? చనిపోతే లెక్కలోకి తీసుకోరా? అంటూ భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి రాము అధికారులను ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో 64 మంది, సూర్యాపేట జిల్లాలో 39, యాదాద్రి జిల్లాలో 27 మంది చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 130 మందికి పైగా రైతులు చనిపోయారని తెలిపారు. ఆ జిల్లాల్లోనే అత్యధికంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయని నిలదీశారు. నిరుడు డిస్కమ్ పరిధిలో 382 మందికి పరిహారమిచ్చినట్టు అధికారులు వెల్లడించారని, నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోని వారు, నష్టపరిహారం అందని వారి సంగతేమిటని ప్రశ్నించారు. మరణాలపై వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. రైతులపై ఇంజినీర్లు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ, దూషణలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు విద్యుత్తు ఇంజినీర్లు కనీస మర్యాద ఇవ్వడమే లేదని చెప్పారు. అన్ని సమయాల్లో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓఆర్సీ లేకుండా కనెక్షన్ ఇస్తామన్నారని, కానీ, గతంలో దరఖాస్తు చేసుకొని కనెక్షన్లు పొందని, పెండింగ్ కనెక్షన్ల సంగతి ఏమిటని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో రైతుల సమస్యలపై వినియోగదారుల ఫోరాన్ని (సీజీఆర్ఎఫ్) ఆశ్రయించినా ఆయా సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
వినియోగదారుల అభ్యంతరాలు, వినతులు