“కొరియన్ కనకరాజు’ ఓ వినోదాత్మక ప్రయాణం. ముఖ్యంగా కొరియన్ ఆత్మ ఆవహించిన హీరో కొరియన్‌లా మాట్లాడుతుంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు’ అంటున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఆయన దర్శకత్వంలో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఈ నెల 7న విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు మేర్లపాక గాంధీ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
ఫ్రెండ్స్‌తో కలిసి అనంతపురం మీదుగా ఓ పెళ్లికి వెళ్లాం. రాత్రి సమయంలో కియా ఫ్యాక్టరీ దగ్గర ఆగాం. విజువల్‌గా ఆ ప్రదేశం బాగుంది. అక్కడ కొరియన్ల కోసం ఓ కమ్యూనిటీ, వాళ్ల కల్చర్‌కు తగ్గట్టుగా రెస్టారెంట్లు, మార్కెట్లు ఉన్నాయి. అనంతపురం లాంటి ఏరియాలో కొరియన్ కల్చర్ కనిపించడం కొత్తగా అనిపించింది. అప్పుడే కొరియాను, అనంతపురాన్ని కలుపుతూ కథ రాయాలని ఫిక్స్ అయ్యాను. కొరియన్ ఆత్మ అనంతపురం యువకుడిని ఆవహిస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాను.
వరుణ్‌తేజ్ మంచి నటుడు. కొత్త ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో ఆయన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి కనకరాజు. రెండోది కొరియన్. రెండూ ఛాలెంజింగ్‌గానే ఉంటాయి. వరుణ్‌కి అనంతపురం స్లాంగ్ తెలియదు. కొరియా భాష అసలే రాదు. అందుకే కొరియన్లో శిక్షణ ఇప్పించాం. కథ రీత్యా హీరోయిన్ రితిక ఇందులో కియా ఫ్యాక్టరీలో ఎంప్లాయ్. తనకు కొరియన్ భాష కూడా తెలుసు. అందుకే తీసుకున్నాం. ఇక సునీల్, సత్య, మురళీధర్‌గౌడ్.. ఇలా ప్రతి పాత్ర ఇందులో వినోదాన్ని పంచుతుంది. ఫన్‌తో పాటు ఎమోషన్స్ కూడా ఇందులో బలంగా ఉంటాయి. సాంకేతికంగా సినిమా రిచ్‌గా ఉంటుంది. తమన్ సంగీతం సినిమాకు హైలైట్. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉన్నది.