ఆదివారం 24 జనవరి 2021
International - Dec 22, 2020 , 01:35:18

కరోనా 2.0

కరోనా 2.0

  • బ్రిటన్‌లో కొవిడ్‌ కొత్త ఉత్పరివర్తనం.. 70% వేగంగా వ్యాపిస్తున్న వైరస్‌
  • అప్రమత్తంగా ఉండాలన్న డబ్ల్యూహెచ్‌వో.. 
  • బ్రిటన్‌ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం
  • ఇప్పటికే రద్దు చేసిన పలుదేశాలు 
  • దక్షిణాఫ్రికాలోనూ మరో కొత్త రకం కరోనా

బహురూపుల కరోనా అనుకున్నట్టే కొత్త రూపు దాల్చింది. ఇప్పటికే పలు ఉత్పరివర్తనాలకు లోనైన రక్కసి వైరస్‌.. ఇప్పుడు ఊహించనంత వేగంగా వ్యాపించే సామర్థ్యంతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నది. పట్టు సడలిందని ఊపిరి పీల్చుకునేలోపే బ్రిటన్‌ను తొలి దెబ్బ తీసింది. దక్షిణాఫ్రికాలోనూ మరో రూపంలో వికటాట్టహాసం చేస్తున్నది. కొత్త పరిణామంతో ఉలిక్కిపడిన దేశాలు.. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాయి. బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను భారత్‌ సహా అనేక దేశాలు నిషేధించాయి. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సైతం బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి పంపిస్తున్నారు.

లండన్‌: ఏడాదిగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా రక్కసి మరో వికృత రూపం దాల్చింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి మహమ్మారికి ముగింపు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కొత్త అవతారమెత్తి పంజా విసురుతున్నది. ముందటి కంటే మరింత వేగంగా వ్యాపిస్తూ కొత్త సవాళ్లు విసురుతున్నది. బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలలో కొత్త రకం కరోనా కేసులు వెలుగుచూడడం కలవరపెడుతున్నది. 

రెండు దేశాల్లో భిన్న రకాలు

బ్రిటన్‌లో తాజాగా వెలుగుచూసిన కరోనా స్ట్రెయిన్‌ను (వైరస్‌ రకాన్ని) ‘వీయూఐ-2020/01’గా పిలుస్తున్నారు. సాధారణ కరోనా వైరస్‌ కంటే ఇది 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఈ వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. తీవ్రమైన అనారోగ్యాన్ని, మరణాల రేటును పెంచుతున్నట్టు ఇప్పటివరకూ ఆధారాలేమీలేవని ఇంగ్లండ్‌ వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణాఫ్రికాలో కూడా కొత్త రకం కరోనా వైరస్‌ను అధికారులు గుర్తించారు. దీన్ని ‘501.వీ2’గా పిలుస్తున్నారు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తితో కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నట్టు దక్షిణాఫ్రికా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

బోరిస్‌ అత్యవసర సమావేశం

బ్రిటన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్‌ సమాచారం పూర్తిగా తెలిసేవరకూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. బ్రిటన్‌లో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆ దేశానికి వెళ్లే విమానాల రాకపోకలపై ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్‌, బల్గేరియా, ఐరిష్‌ రిపబ్లిక్‌, టర్కీ, కెనడా నిషేధం విధించాయి. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తాజా పరిస్థితులపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సోమవారం ప్రభుత్వాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 

వైరస్‌ ఉత్పరివర్తనం అంటే?

వైరస్‌ జన్యు క్రమంలో చోటుచేసుకునే మార్పులనే ‘ఉత్పరివర్తనం’ అంటారు. రోగి శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌.. రోగ నిరోధక శక్తితో పోరాడేందుకు ఉత్పరివర్తనం చెందుతుంది. దీంతో కొత్త రూపంలోకి మారుతుంది.

విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు

బ్రిటన్‌లో కొత్త రకం వైరస్‌ వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ర్టాలకు సూచించింది. డిసెంబర్‌ 31 వరకు బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సోమవారం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నది. బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులను మంగళవారం అర్ధరాత్రి వరకు అనుమతిస్తామని, ప్రయాణికులు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. పాజిటివ్‌ వచ్చిన వారు రాష్ట్ర ప్రభుత్వ క్వారంటైన్‌కు వెళ్లాలని, నెగెటివ్‌ వచ్చినా ఏడు రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. కొత్త రకం వైరస్‌ పట్ల భయాందోళనలు అవసరంలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వైరస్‌ పట్ల కేంద్రం అప్రమత్తంగా ఉన్నదన్నారు. 

ప్రాణాంతకమేమీ కాదు: వివేక్‌ మూర్తి

బ్రిటన్‌లో తాజాగా వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌ ప్రాణాంతకమైనదేమీకాదని ఇండో-అమెరికన్‌ వైద్యుడు, కాబోయే అమెరికా సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి తెలిపారు. వైరస్‌ కట్టడికి అభివృద్ధి చేసిన టీకాలు.. కొత్త స్ట్రెయిన్‌ను సమర్థమంతంగా ఎదుర్కొనలేవన్న వాదన కూడా సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడికి నిబంధనలను పాటించడం ముఖ్యమని సూచించారు. 

ఇన్ని మార్పులు చరిత్రలో ఇదే తొలిసారి

కరోనా వైరస్‌ వ్యాప్తిలో దాని ఉపరితలంపై ఉండే కొమ్ములే కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొత్త రకం కరోనా కొమ్ముల్లో 17 రకాల ఉత్పరివర్తనాలు కనిపించినట్లు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త రవిగుప్తా తెలిపారు. ఒక వైరస్‌లో ఒకేసారి 17 మార్పులు చోటుచేసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కొత్త రకం కరోనా రోగులపై 70 శాతం ఎక్కువ ప్రభావం చూపుతుంది. వైరస్‌ లక్షణాల్లో పెద్ద మార్పులేమీ లేవు. అయితే 86 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు.  

-డాక్టర్‌ రఘురామ్‌రావు, ప్రముఖ ఫార్మకాలజీ శాస్త్రవేత్త

మనకూ ప్రమాదం పొంచి ఉంది

ఉత్పవర్తనం చెందిన కరోనా వైరస్‌ వల్ల మనకూ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే బ్రిటన్‌ తదితర విదేశాల నుంచి నిన్నటివరకు ప్రయాణికులు మన దగ్గరకు వచ్చారు. వారివల్ల వైరస్‌ వ్యాప్తి చెందవచ్చు. కరోనా ప్రారంభంలో కూడా అదే జరిగింది. మన దేశంలో లేదా రాష్ట్రంలో కొత్త రకం కరోనా వ్యాప్తి చెందడానికి రెండు మూడు నెలలు పట్టవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

-డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌

ప్రస్తుత వ్యాక్సిన్‌లు పనిచేస్తాయా?

కరోనా చికిత్సకు ప్రస్తుతం అభివృద్ధి చేసిన టీకాలు కొత్త రకం కరోనా వైరస్‌ల కట్టడికి ఎంతమేరకు సాయపడుతాయోనన్న చర్చ ఊపందుకున్నది. కరోనా కట్టడిలో వైరస్‌కు అత్యంత ప్రధానమైన కొమ్ము భాగాల్ని బలహీనపర్చాల్సి ఉంటుంది. తాజాగా అభివృద్ధి చేసిన అత్యధిక వ్యాక్సిన్‌లు వైరస్‌ కొమ్ము భాగాల పనితీరును దెబ్బతీయడమే లక్ష్యంగా రూపొందించినవి. వైరస్‌ ఉత్పరివర్తనం చెందితే దాని కొమ్ము భాగంలో కూడా మార్పులు జరుగుతాయి. దీంతో ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన టీకాల సామర్థ్యం కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌లను కట్టడి చేయడానికి సాయపడుతుందో? లేదో? ఇప్పటికిప్పుడు చెప్పలేమని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త వైరస్‌పై పూర్తి సమాచారం విశ్లేషించిన తర్వాతనే వ్యాక్సిన్‌ల పనితీరుపై పూర్తి స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

అప్రమత్తంగా రాష్ట్రప్రభుత్వం

బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాలు రాకపోకలు సాగిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వారం, పది రోజుల్లో దాదాపు 3 వేల మంది వచ్చినట్టు సమాచారం. వీరందరినీ కరోనా నిర్ధారణ పరీక్షల రిపోర్టు పరిశీలించిన తర్వాతే నగరంలోకి అనుమతిచ్చినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికుల వివరాల ఆధారంగా వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ సిద్ధమైంది. యూకే నుంచి హైదరాబాద్‌కు నేరుగా వారానికి 5 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 


logo