Sai Chinmayi | ల్యాప్‌టాప్ మీద నాట్యం చేసిన చేతులు కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాయి. ప్రోగ్రామింగ్‌తో పండిపోయిన బుర్ర.. ఏ పంట వేయాలన్నది క్షణాల్లో నిర్ణయిస్తున్నది. లేటెస్ట్ టెక్నాలజీ కోసం గూగుల్ చేసిన అనుభవం.. ఆధునిక సేద్య విధానాలను ఆ శివారు పల్లెకు సాదరంగా ఆహ్వానిస్తున్నది. నిన్నమొన్నటి వరకూ అంతర్జాతీయ క్లయింట్లతో సంభాషించిన ఆ ఐటీ నిపుణురాలు ఇప్పుడు.. పశుపక్ష్యాదుల భాషనూ అర్థం చేసుకుంటున్నది. ఏనుగు సాయి చిన్మయి సేద్యానికి ఆధునికతను జోడించింది. వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నది.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ శివారులో ఏనుగు మోహన్ రెడ్డి, సుజాత దంపతులకు ఆరెకరాల విస్తీర్ణంలో మామిడి తోట ఉంది. పత్తి, కంది, జొన్న తదితర వాణిజ్య, ఆహార పంటలు వేసేవారు. ఆ ఆలూమగల కలలపంట సాయి చిన్మయి. హైదరాబాద్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివింది. ఓ కార్పొరేట్ సంస్థలో బిజినెస్ ఎనలిస్ట్‌గా కొంతకాలం పని చేసింది. కానీ, నగర జీవితంలోని కృత్రిమత్వం, కాలుష్యం, రసాయనాలలో ముంచితేల్చిన ఆహారం.. చిన్మయికి నచ్చలేదు. ఉరుకులు పరుగుల జీవితమంటేనే అసహ్యం కలిగింది. అంతలోనే కరోనా సంక్షోభం మొదలైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. చిన్మయి ఇంటి దారిపట్టింది. ఇచ్చోడలోని తమ తోటలో కూర్చునే ఆఫీసు పని చేసుకునేది. తీరిక సమయంలో పొలం పనులు పర్యవేక్షించేది. అలా సేద్యం మీద మక్కువ పెరిగింది. వ్యవసాయానికి అనుబంధంగా కూరగాయలు, పండ్లు, పూలు.. సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలనుకున్నది. తల్లిదండ్రులూ ప్రోత్సహించారు. వెంటనే రంగంలోకి దిగింది. మామిడితోటలో వరుసలకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలాన్ని పండ్లు, పూలు, ఔషధ మొక్కల పెంపకానికి ఎంచుకున్నది. అంతర్ పంటల విషయానికొస్తే .. ఎరుపు, గ్రీన్ ఆపిల్, జామ, సీతాఫలం, బొప్పాయి, నలుపు-తెలుపు అల్లనేరేడు, సంత్రా లాంటి పండ్ల జాతులు; గులాబి, చామంతి, పారిజాతం, తులసి, నంది వర్ధనం, బంతి, జాజి, విరజాజి, బొకే గులాబి, నాగపడగ, డచ్ రోజెస్ తదితర పూలు; పాలకూర, చెలిమెటి, పుంటి, మెంతి, కొత్తిమీర వగైరా ఆకుకూరలు; టమాట, వంకాయ, బెండ, చిక్కుడులాంటి కూరగాయలు సాగుచేస్తున్నది. ఇవేగాక దాల్చినచెక్కతో పాటు 10 రకాల మసాలా దినుసుల మొక్కలూ ఉన్నాయి. మొత్తంగా అన్నీ కలిపితే కనీసం 80 రకాల పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నది. దీంతోపాటు మామిడి చెట్లకు తేనెటీగలు తుట్టెలు పెడుతున్నాయి.
చిన్మయి వ్యవసాయ క్షేత్రంలోని పురాతన మోటబావి ఇప్పటికీ నిండుకుండలా తొణికిసలాడుతూ ఉంటుంది. సమీపంలోనే ఉన్న కుంటలు ఇక్కడ భూగర్భజలాల వృద్ధికి ఓ కారణం కావచ్చు. ఇంటి ఆవరణలో, పొలంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడంతో వర్షపు నీరు చుక్క కూడా వృథా కాదు. భవిష్యత్‌లో వర్షపు నీటి సంరక్షణకు 2,000 లీటర్ల సామర్థ్యంతో ఓ ట్యాంకును నిర్మించే ప్రయత్నంలో ఉంది చిన్మయి. బిందు సేద్యం ద్వారా ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ వ్యవసాయ క్షేత్రంలో. చిన్మయి కుటుంబం రెండు మేలురకం జెర్సీ ఆవులను తెప్పించింది. నల్లావుకు గౌరి, తెల్లావుకు లక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. వాటికోసం మూడు ఎకరాల్లో గడ్డి సాగు చేస్తున్నారు. ఆవుదూడలను రుద్ర, మిల్కీ, జున్ను .. ఇలా పేర్లు పెట్టే పిలుస్తారు. చిన్మయి కనిపించగానే అవి ‘అంబా’ అంటూ పలకరిస్తాయి. ఆమె కూడా అంతే ప్రేమను కురిపిస్తుంది. కుందేళ్లు, బాతులు, కోళ్ల పెంపకం కూడా చేపట్టింది చిన్మయి. గుడ్లను సహజ పద్ధతిలో, ఇన్క్యుబేటర్ ద్వారా పొదిగిస్తున్నారు. కుందేళ్లు, కోళ్లకు ఇక్కడే దాణా తయారుచేస్తున్నారు. ఆవులు, కోళ్ల పెంటను సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు. పాముల ప్రమాదం లేకుండా రాజహంసలను పోషిస్తున్నారు. భవిష్యత్‌లో గొర్రెల పెంపకం కూడా చేపడతామని చిన్మయి చెబుతున్నది. అన్నట్టు తను మంచి చిత్రకారిణి కూడా. పచ్చని పరిసరాలు ఆమె ఊహలకు రెక్కలు తొడుగుతున్నాయి.
ఆధునిక సాంకేతికతను, సర్కారు చేయూతను అందిపుచ్చుకుంటే అద్భుతాలు చేయవచ్చు. నేను వ్యవసాయాన్ని అభిమానిస్తాను. అమ్మానాన్నల సహకారంతో ముందుగా మార్కెట్‌ను అధ్యయనం చేశాను. అన్ని కాలాల్లో గిరాకీ ఉండే పండ్లు, పూలు, కూరగాయలు పండిస్తున్నా. పాలు, పాల ఉత్పత్తులు కూడా మాకు ఆదాయ వనరులే. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది. దేశంలో మరెక్కడా ఇలాంటి పథకాలు లేవు. ఈ చేయూతను ఉపయోగించుకోవాలి. వివిధ ప్రాంతాల పంటల గురించి, సాగు విధానాల గురించి అధ్యయనం చేయాలి. నేనిప్పుడు చేస్తున్నది కూడా ఓ ప్రయోగమే.
…? లాయర్ ప్రవీణ్‌కుమార్
Read More :
ఒకసారి మోడలింగ్ చేస్తే.. ఇంకోసారి పొలం పనులు చేస్తది.. ఎందుకలా..”
Kriti Trust | నలుగురి కోసం ఆ ఇద్దరు.. లక్షల జీతాలు వదిలి మరి..”
ఆఫ్రికా దేశంలోని ఓ బ్యాంకు రూపురేఖల్నే మార్చేసిన తెలంగాణ బిడ్డ.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..”
ఈ తహసీల్దార్ రూటే సపరేటు.. మంత్లీ మంత్లీ ఛాలెంజ్‌లు పెడుతూ ఆదర్శంగా మారిన ఎమ్మార్వో”