కారేపల్లి, నవంబర్ 21 : విద్యార్థులకు క్రిందిస్థాయి తరగతులను నుండే శాస్త్రీయ అవగాహన కల్పించాలని జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్ బాలిన వెంకటరెడ్డి, గుత్తా ఫణికుమార్ అన్నారు. శుక్రవారం కారేపల్లి మోడల్ స్కూల్లో చెకుముకి మండల స్ధాయి టాలెంట్ టెస్టును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజం వెనుకబాటుకు మూఢ విశ్వాసాలు కారణమవుతున్నాయన్నారు. సామాజిక అభ్యుదయానికి సైన్స్ దోహద పడుతుందని తెలిపారు. విద్యార్ధుల్లో పోటితత్వం, నైపుణ్యాలను పెంపొందిస్తే ఆదర్శవంతులైన పౌరులుగా ఎదుగుతారన్నారు.
ఈ మండల స్ధాయిలో పోటీల్లో మోడల్ స్కూల్, బాజుమల్లాయిగూడెం, డీఏవీ పాఠశాలల విద్యార్ధులు ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలవడంతో పాటు జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు అర్హత సాధించారు. రెండో స్థానంలో కారేపల్లి హైస్కూల్, మైనార్టీ గురుకులం, తృతీయ స్థానంలో కోమట్లగూడెం హైస్కూల్, కారేపల్లి కేజీబీవీ విద్యార్ధులు నిలిచారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.