Shivaji | తెలుగు సినీ నటుడు శివాజీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాలపై చురుకుగా స్పందించిన ఆయన, ప్రస్తుతం మాత్రం సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టలేదని, అవసరం అయితే తప్పకుండా స్పందిస్తానని చెప్పారు. ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ, ఇక నాకెందుకు రాజకీయాలు.. హాయిగా సినిమాలు చేసుకుంటాను. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అలాగని దేశంలో లేదా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను గమనించకుండా లేను. ఎక్కడైనా శృతి మించితే మాత్రం తప్పకుండా మాట్లాడుతాను అని స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయ్యిందని, పాలనను పూర్తిగా అంచనా వేయడానికి ఇంకా కొంత సమయం అవసరమని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని మారిపోతాయని అనుకోవడం సరైంది కాదు. సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది అని ఆయన అన్నారు. ఇక రాజకీయ నాయకులపై గతంలో జరిగిన విమర్శల గురించి కూడా శివాజీ మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నాయకులపై జరిగిన విమర్శలను గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా విమర్శించారో అందరికీ తెలుసు. ఎన్నో తిట్లు తిన్నారు. కానీ చివరికి ఏమైంది? ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అదే ప్రజాస్వామ్యం శక్తి అని అన్నారు.
అలాగే నారా లోకేష్ గురించి కూడా శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “లోకేష్ బాబు గారిని చాలా కాలం ‘పప్పు పప్పు’ అంటూ ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచం ఆయన పప్పు కాదు… నిప్పు అని చెబుతోంది. పప్పు అని ఎగతాళి చేసిన వారే చివరకు ఆయనలో ఉన్న నాయకత్వాన్ని బయటకు తీసుకొచ్చారు” అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నాయకులు ప్రజల విశ్వాసం పొందడం ఎంతో ముఖ్యమని శివాజీ అభిప్రాయపడ్డారు. రాజకీయం అంటే ప్రజలు మన వెనకాల నిలబడాలి. నాయకులు ప్రజల్లో భయం కలిగించకూడదు. ప్రజలు మనపై నమ్మకం ఉంచి మనతో నడవాలి అని ఆయన చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం తాను కొన్ని కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని శివాజీ తెలిపారు. మంచి కథలు, బలమైన పాత్రలు వస్తే తప్పకుండా ప్రేక్షకులను అలరించే సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.