Litin Kumar | కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టాలను పక్కన పెట్టాల్సిందే! ఎన్ని ఇక్కట్లు వచ్చినా పట్టిన పుస్తకాన్ని వదల్లేదు ఆ కుర్రాడు. తల్లి ప్రోత్సాహం, అన్న ప్రోద్బలంతో చదువు కొనసాగించాడు. బీటెక్ పూర్తిచేశాడు. ఇంట గెలిచి రచ్చ సత్తా చాటుతున్నాడు. ఆఫ్రికన్ దేశం సియెరా లియోన్ లోని రోకల్ కమర్షియల్ (ఆర్సీ) బ్యాంక్ రూపురేఖల్నే మార్చేశాడు. సాంకేతికత సాయంతో బ్యాంకు సేవలను వినియోగదారులకు చేరువ చేసి ‘శభాష్’ అనిపించుకున్నాడు. అక్కడి ప్రభుత్వం సైతం ఆయన సేవలను వినియోగించుకోవడం విశేషం. దేశం కాని దేశంలో సత్తా చాటుతున్న తెలంగాణ బిడ్డ లితిన్ కుమార్ పరిచయం..
హనుమకొండ జిల్లా వేయిస్తంభాల గుడి సమీపంలోని న్యూ రాయపురలో లితిన్ పుట్టి పెరిగాడు. తను తొమ్మిదో తరగతిలో ఉండగానే తండ్రి మరణించారు. దాంతో కుటుంబ భారం తల్లిపై పడింది. ఇద్దరు కొడుకులు, కూతురిని చదివించే బాధ్యత ఆమెదే అయ్యింది. అప్పటికే ఇంటి మీద రుణంతోపాటు బయట అప్పులు ఉండటంతో చదువు మానేసి తల్లికి చేదోడుగా ఉంటానన్నాడు లితిన్. కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా చదువు ఆపొద్దని చెప్పింది తల్లి. ఇంటి ముందు కిరాణా, కూరగాయల దుకాణం పెట్టింది. తల్లి కష్టాన్ని అర్థంచేసుకున్న లితిన్ ఆమె ఆకాంక్ష ప్రకారమే కష్టపడి చదివాడు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్)లో బీటెక్‌లో చేరాడు. ‘మా అమ్మ ఉదయాన్నే కూరగాయలు అమ్మడానికి వెళ్లేది. తొమ్మిదిలోపు వచ్చి రూ.50 ఇచ్చేది. ఆ డబ్బు అందితేగానీ కాలేజీకి వెళ్లలేని పరిస్థితి నాది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు లితిన్. 2011లో లితిన్ అన్నయ్యకు హోంగార్డుగా ఉద్యోగం రావడంతో పరిస్థితి కుదురుకుంది.
రెండువేలతో ప్రస్థానం
2014లో బీటెక్ పూర్తికాగానే హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జూనియర్ ప్రోగ్రామర్‌గా చేరాడు లితిన్. జీతం రెండు వేలు. అంచెలు అంచెలుగా ఎదుగుతూ మొబైల్ యాప్ డెవలపర్ స్థాయికి ఎదిగాడు. అదే సమయంలోనే సియోరా లియాన్ దేశంలోని ఆర్సీ బ్యాంక్‌లో అవకాశం వచ్చింది. అప్పటికే ఆ బ్యాంక్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఐటీ సేవల్లో బ్యాంక్ వెనుకబాటుతనమే అందుకు కారణం. దీన్ని మెరుగుపరచడానికి ఒక ఐటీ కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని బ్యాంకు అధికారులు భావించారు. ఆ వెతుకులాటలో నౌకరీ.కామ్‌లో లితిన్ ప్రొఫైల్ కనిపించింది. బ్యాంక్ అధికారులు సంప్రదించడం, ఇంటర్వ్యూలో లితిన్ ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. నెలకు రూ.ఐదున్నర లక్షల వేతనం మీద చేరాడు.
రూపురేఖల్ని మార్చేసి..
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విఫలమైన ఆర్సీ బ్యాంక్‌ను కస్టమర్లకు చేరువ చేసే లక్ష్యంతో అహర్నిశలు కృషిచేశాడు లితిన్.
‘ఉద్యోగంలో చేరగానే.. నెల రోజులపాటు మొత్తం వ్యవస్థను పరిశీలించా. ఇంకా పాతకాలం పద్ధతులనే అవలంబిస్తున్నారు. అప్పటివరకు ఆ కంపెనీకి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) అనేది లేదు. వాళ్లతో మాట్లాడి క్రియేట్ చేయించాను. ‘రోకల్ సిమ్ కార్పర్ ప్లస్’ మొబైల్ యాప్‌ను డెవలప్ చేశా. ఆ దేశంలోనే టాప్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అది. మొబైల్ ద్వారానే బ్యాంకింగ్ సేవలన్నిటినీ పొందవచ్చు. దాంతో బ్యాంక్‌కు మంచి రోజులు వచ్చాయి’ అని చెబుతాడు లితిన్. తర్వాత పర్సనల్ బ్యాంకింగ్ పోర్టల్, కార్పొరేట్ బ్యాంకింగ్ కోసం మరో అప్లికేషన్ రూపొందించాడు. అక్కడి ప్రభుత్వానికి తనవంతు సహకారం అందించి అధికారుల ప్రశంసలు పొందాడు. ‘మీ లాంటి సాంకేతిక ప్రతిభావంతుడిని కన్న తెలంగాణకు మేం రుణపడి ఉంటాం’ అని మెచ్చుకున్నారు.
– గుళ్లపెల్లి సిద్ధార్థగౌడ్
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?”
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా